టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో అనుపమ పరమేశ్వరన్ వరుస హిట్లతో దూసుకుపోయింది. అయితే ఆ తర్వాత మాత్రం కెరీర్ కాస్త స్లో అయింది. అనుపమ నటించిన తెలుగు సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో తమిళంపై ఫోకస్ చేసింది. అయితే పోయిన ఏడాది రిలీజ్ అయిన బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా 'రాక్షసుడు' తో ఒక్కసారిగా అనుపమకు మళ్లీ డిమాండ్ పెరిగింది. అనుపమ మంచి ఆఫర్లు వస్తున్నాయని సమాచారం.
ఈమధ్య తెలుగులో రీమేక్ సినిమాల జోరు పెరిగిందనే సంగతి తెలిసిందే. అదే కోవలో మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'హెలెన్' అనే థ్రిల్లర్ సినిమాను ఓ ప్రముఖ నిర్మాత తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రకు అనుపమను ఎంచుకున్నారట. మలయాళం సినిమాలో ఆనా బెన్, లాల్, అజు, నోబెల్ బాబు థామస్ లు కీలక పాత్రల్లో నటించారు. మాదికుట్టి జేవియర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. త్వరలోనే తెలుగు రీమేక్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి అవుతాయని సమాచారం.
ఇదిలా ఉంటే అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న '18 పేజెస్', 'కార్తికేయ 2' చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో 'తల్లి పోగాదె' అనే చిత్రంలో కూడా నటిస్తోంది.