కథల ఎంపిక విషయంలో తొందరేమీ లేదని అంటోంది హీరోయిన్ అనుష్క శట్టిె. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోన్న అనుష్క, అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్‌గానూ రికార్డులకెక్కింది. 50 కోట్ల బడ్జెట్‌తో సినిమా తెరకెక్కినా, సోలోగా స్టామినా చాటగల అనుష్క, గత కొంతకాలంగా కథల ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ‘కమర్షియల్ సినిమాలెన్నింటినో చేశాను.. హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్‌లోనూ నటించాను.. అయితే, ఇప్పుడు కెరీర్‌లో ఇంకాస్త ఇంటరెస్టింగ్ ఫేస్‌లో కొనసాగుతున్నాను.
కథల ఎంపికలో తొందర లేదు. వేగంగా ఎక్కువ సినిమాలు చేసెయ్యాలన్న ఆలోచన కూడా లేదు. నటిగా, ఇన్నేళ్ళలో చాలా నేర్చుకున్నాను..’ అని ఓ ఇంటర్వ్యూలో అనుష్క వ్యాఖ్యానించింది. ‘ఎప్పుడూ కథ, అందులో నా పాత్ర గురించే తొలుత ఆలోచిస్తాను. సినిమాలో హీరో ఎవరు.? అని ఆలోచించి ఆయా సినిమాల్ని ఒప్పుకోవడం, మానేయడం వంటివి చేయలేదు, చేయబోను..’ అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది అనుష్క. ఇటీవల ‘నిశ్శబ్దం’ సినిమాలో నటించిన అనుష్క, ఆ సినిమా ఓటీటీ ద్వారా విడుదలవడం కొత్త అనుభూతి అనీ, అయితే సినిమా హాళ్ళలో ఆ సినిమాని ప్రేక్షకులు చూసి వుంటే, చాలా చాలా భిన్నమైన అనుభూతి పొందేవారని చెప్పింది. సినిమా హాళ్ళు మళ్ళీ తెరుచుకుంటే, సినిమా పరిశ్రమ మునుపటి ఉత్సాహాన్ని సంతరించుకోవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని అభిప్రాయపడింది.