మెగా హీరోయిన్ కోసం సెర్చ్ స్టార్ట్ అయిపోయింది. చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150'లో హీరోయిన్ కోసం చాలా వెతుకులాట సాగించారు. ఎలాగో కాజల్ ఆ సినిమాకి హీరోయిన్‌గా సెట్టయ్యింది. హీరోయిన్‌ని వెతికే పని పక్కన పెట్టి, ఆ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లారు. లాస్ట్ మినిట్ వరకూ హీరోయిన్ విషయంలో సస్పెన్స్ నడిచింది. అయితే 151వ సినిమా విషయంలో అలా కాదంట. మందుగానే హీరోయిన్ ఎంపిక చేయాలనుకుంటున్నారట. ఈ సినిమా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో తెరకెక్కించాలనుకుంటున్న సంగతి విదితమే. త్వరలోనే సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది కూడా. ఈ సినిమా రామ్ చరణ్ నిర్మాణంలోనే తెరకెక్కుతోంది. ఇక హీరోయిన్స్ విషయానికొస్తే, నయనతార, అనుష్కలు పరిశీలనలో ఉన్నారు. 150వ సినిమాకే వీరిద్దరి పేర్లు బాగా వినిపించాయి. అయితే అనుష్క అప్పుడు ఖాళీగా లేదు. 'బాహుబలి', నమో వేంకటేశాయ' సినిమాలతో బిజీగా ఉంది. కానీ ఇప్పుడు ఆ సినిమాలు రిలీజ్‌కి రెడీ అయ్యాయి. సో ఆమె డేట్స్ ఖాళీగానే ఉన్నాయి. అందుకే ఆనుష్క మెగాస్టార్‌తో చిందేయడానికి సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నయనతార విషయం తెలిసిందే. ఆమె తమిళంలో అయితే చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేకుండా సినిమాలు చేస్తుంది. కానీ తెలుగులోకొచ్చేసరికి, స్టార్ హీరోలను సైతం లెక్క చేయడం లేదు. ఈ కారణాల దృష్ట్యా మెగాస్టార్‌తో జతకట్టే అదృష్టం అనుష్కకే ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదనిపిస్తోంది.