రోమ్ లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే, వాళ్ల తరపునే మాట్లాడుతుంటాలి. అప్పుడే పనులు జరుగుతాయి. ఈ విషయంలో కొంతమంది ఆరితేరిపోయి ఉంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, సొంత ప్రయోజనాలు దెబ్బతింటాయని వాళ్ల భయం. నాగార్జున కూడా ఈరకంగానే ఆలోచిస్తాడన్న విషయం ఈ మధ్య `బంగార్రాజు` వేడుకలో అర్థమైంది.
టికెట్ రేట్ల వ్యవహారంపై స్పందించమని నాగ్ ని కోరితే..`టికెట్ రేట్ల విషయంలో నాకెలాంటి ఇబ్బంది లేదు` అని చెప్పేశాడు. టికెట్ రేట్లు ఎంతున్నా తనకు ఫరక్ పడదని తేల్చేశాడు. ఓ నిర్మాత అయి ఉండి, ఇండ్రస్ట్రీ గొంతుక వినిపించాల్సిన తరుణంలో, మిగిలిన నిర్మాతలంతా టికెట్ రేట్ల విషయంలో ఇబ్బందులు పడుతున్న తరుణంలో నాగ్ ఇలా మాట్లాడాల్సింది కాదన్న కామెంట్లు వినిపించాయి.
అయితే `ఇబ్బంది లేదు` అన్న మాట.. ఇప్పుడు నాగ్ కి పరోక్షంగా సాయం చేస్తోంది. ఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు `బంగార్రాజు` కోసమే నేమో అనేలా కనిపిస్తున్నాయి. ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న ఏకైక పెద్ద సినిమా బంగార్రాజు. ఈ సీజన్‌పై ఈ సినిమా చాలా ఆశలు పెట్టుకుంది. అయితే ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ, నైట్ కర్‌ఫ్యూ నిబంధనలు బంగార్రాజు దూకుడుకు కళ్లాలు వేస్తాయని భయపడ్డారు.
అయితే.. ఈ రెండు నిబంధనలనూ ఎత్తేసింది ఏపీ ప్రభుత్వం. సంక్రాంతి సీజన్ అయ్యేంత వరకూ 50 శాతం ఆక్యుపెన్సీ, నైట్ కర్‌ఫ్యూలూ లేవని ప్రకటించారు. ఇదంతా బంగార్రాజు ఇబ్బందుల్ని తొలగించడానికే అనే టాక్ వినిపిస్తోంది. ఈ ఉపశమనాలు పూర్తిగా బంగార్రాజుకి ఫేవర్ చేస్తాయన్నది టాలీవుడ్ టాక్. మొత్తానికి నాగ్ కి మంచే జరిగింది.