తెలంగాణ పట్ల అమితమైన ప్రేమ, ఆంధ్రప్రదేశ్ పట్ల నిర్లక్ష్యం తెలుగు సినీ పరిశ్రమకు వున్నాయంటూ చాలా విమర్శలు వినిపిస్తుంటాయి. కొన్నాళ్ళ క్రితం తెలుగు సినీ పరిశ్రమలో అందరూ ఆంధ్రోళ్ళేననీ, ఆ కారణంగా తెలంగాణ అంటే వాళ్ళకి గిట్టదనీ ప్రచారం జరిగింది. అంతిమంగా, సినీ పరిశ్రమ అందరిదీ. తమిళ సినీ ప్రేక్షకులు ఆదరిస్తే, అక్కడి సినిమాల్లో స్టార్లవుతారు.. బాలీవుడ్ పిలిస్తే, అక్కడ మెప్పు పొందగలుగుతారు.
అలాంటిది, తెలుగు రాష్ట్రాల విషయంలో తెలుగు సినీ ప్రముఖులకు ఆ బేదాభిప్రాయాలెందుకు వుంటాయి.? అసలు విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు 'రీస్టార్ట్ ప్యాకేజీ'ని ప్రకటించింది. దాంతో మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచి, సినీ ప్రముఖులంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమకు కరోనా నేపథ్యంలో ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కీ కృతజ్ఞతలు తెలిపారు.
అప్పట్లో సినీ పరిశ్రమని ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కొందరు నెటిజన్లు (ఆయా పార్టీల సానుభూతిపరులు) తీవ్రంగా విమర్శించారు, దూషించారు కూడా. కానీ, ఇప్పుడు అదే తెలుగు సినీ పరిశ్రమ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ కృతజ్ఞతలు చెప్పింది. ఇప్పుడు సదరు ట్రోల్స్ చేసిన నెటిజన్లు ఏమనంటారు.? కరోనా నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ కనీ వినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంది. దాన్నుంచి పరిశ్రమ కోలుకోవాలంటే రెండు తెలుగు రాష్ట్రాలూ పరిశ్రమను ఆదుకోవాలి.