నటీనటులు: రానా, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయ తదితరులు
దర్శకత్వం: ప్రభు సాల్మన్
నిర్మాతలు: ఈరోస్ ఇంటర్నేషనల్
సంగీతం: శాంతను
సినిమాటోగ్రఫీ: ఎ. ఆర్. అశోక్ కుమార్
ఎడిటర్: బువన్
రేటింగ్: 2.7/5
ప్రకృతి మనకు చాలా ఇచ్చింది. మనమే... తిరిగి ఇవ్వడం మానేశాం. సరికదా.. ఉన్న ప్రకృతినే.. నాశనం చేస్తున్నాం. ప్రస్తుత అవసరాల కోసం భవిష్యత్తుని త్యాగం చేస్తున్నాం. అడవుల్ని, వన్య ప్రాణుల్నీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మన బాధ్యతని విస్మరిస్తూ... ప్రకృతిని నాశనం చేస్తూ.. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి గోతులు తవ్వుతున్నాం. ఇప్పుడిప్పుడే అందరిలోనూ కొంత మార్పు వస్తోంది. మొక్కల్ని నాటి.. ప్రకృతిని కాపాడడానికి ఎంతో కొంత సాయం చేస్తున్నారు. ఇలాంటి దశలో అందరిలోనూ సరికొత్త ఆలోచన రేకెత్తించే సినిమా వచ్చింది. అదే... అరణ్య.
* కథ
నరేంద్ర భూపతి (రానా) కుటుంబం మొత్తం అడవులకి అంతకితమైపోయింది. వేలాది ఎకరాలు అడవుల కోసం త్యాగం చేస్తారు. నరేంద్ర భూపతి ఫారెస్ట్ మేన్‌గా రాష్ట్రపతి నుంచి అవార్డ్ పొందిన వ్యక్తి. తనని అందరూ అరణ్య అని పిలుస్తుంటారు. పక్షులతో, మొక్కలతో స్నేహం చేస్తుంటాడు అరణ్య. తనకు ఏనుగలంటే ప్రాణం.
ఆ అడవిపై కేంద్ర మంత్రి (అనంత్ మహదేవన్) కన్ను పడుతుంది. ఎలాగైనా ఆ భూమిని స్వాధీనం చేసుకుని, అక్కడ ఓ టౌన్‌షిప్ కట్టాలని వ్యూహం రచిస్తాడు. అక్కడి నుంచి ఏమైంది? ఆ అడవిని.. నరేంద్ర భూపతి కాపాడుకున్నాడా, లేదా? ఆ ప్రయాణంలో తనకు ఎదురైన ఆటుపోట్లేంటి? అనేదే మిగిలిన కథ.
* విశ్లేషణ
అడవీ - ఏనుగులు - అందులో నక్సల్ ఉద్యమం.. ఇవన్నీ కలగలిపి ఓకమర్షియల్ సినిమాకి కావల్సిన హంగులన్నీ ఇందులో ఉన్నాయి. కథని ప్రారంభించిన విధానం కూడా ఆసక్తి కలిగిస్తుంది. ఓ లయన్ కింగ్ లాంటి సినిమాని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. విజువల్స్ గ్రాండ్ గా ఉంటాయి. డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్లిపోవడంతో ఆ ఆసక్తి మరింత పెరుగుతుంది. దర్శకుడి కి మంచి ఉద్దేశం ఉంది. తన ఆశయం కూడా గొప్పదే. అయితే క్రమంగా ఈ సినిమా ఓ డాక్యుమెంటరీ స్టైల్ లోకి వెళ్లిపోతుంది. ఎలాంటి కథ చెప్పినా జనరంజకం గా ఉండాలి. ఈ కథని అలా తీయొచ్చు కూడా. కానీ దర్శకుడు పట్టు తప్పేశాడు. అనవసరమైన డిటైలింగ్ తో తలనొప్పి తెప్పిస్తాడు.
ఈ కథకు ఏమాత్రం అతకని ఎమోషన్లు పట్టుకొచ్చి అతికించాడు. దాంతో పాటు లాజిక్ కి అందని పాయింట్లు చాలా ఉన్నాయి. ఇదంతా అటవీ నేపథ్యంలో సాగే కథగా చూపిస్తారు. ఒక్కోసారి జన సామాన్యానికి దూరంగా ఉండే అడవిలా చూపిస్తే, ఇంకోసారి అదేదో టౌన్ కి ఆనుకుని ఉన్న అరణ్యంలా చూపిస్తారు. ఈ విషయంలో దర్శకుడికి క్లారిటీ మిస్సయ్యింది. పతాక సన్నివేశాలు సైతం హడావుడి గా ముగించినట్టు కనిపిస్తుంది. అంతవరకూ... అరణ్యపోరాటాన్ని పట్టించుకోని జనం.. చివర్లో ఓ ధర్నా చేస్తే - అది వైరల్ అయిపోవడం, ప్రభుత్వాలు దిగి రావడం చూపించేశారు. దాంతో.. అవన్నీ అతకలేదు. హీరో మొదలెట్టిన ఉద్యమాన్న పక్కదోవ పట్టించడానికి విలన్ వేసే ఎత్తులన్నీ పాత చింతకాయ పచ్చడి వాసన కొడుతుంటాయి.
ఈ కథలో కావల్సిన హంగులు చాలా ఉన్నాయి. కాకపోతే... అవేం కథగా మారలేకపోయాయి. ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేది ఎమోషన్స్ కే. అవి కరువయ్యాయి. కొన్ని సన్నివేశాల్ని ఎంత సహజంగా తీశాడో, కొన్నింటిని అంతే కృత్రిమంగా లాంగించేశాడు. యాక్షన్ సన్నివేశాలపై మరింత దృష్టి పెట్టాల్సింది అనిపిస్తుంది.
* నటీనటులు
నటుడిగా రానాని మరో మెట్టు ఎక్కించిన సినిమా ఇది. తన హావభావాలు, మాట్లాడే విధానం, నడిచే పద్ధతి... ఒకటేమిటి.. అన్నీ పర్‌ఫెక్ట్. అడవిపై తనకున్న ప్రేమ తన మాటల్లోనే కాదు, నటనలోనూ కనిపించింది. శ్రియా పిల్లోంకర్ పాత్ర కథని మలుపు తిప్పుకుంది. జోయా - విష్ణు విశాల్ ల మధ్య లవ్ ట్రాక్ బాగుంది. వాళ్ల కెమిస్ట్రీ కూడా నచ్చుతుంది.
* సాంకేతిక వర్గం
టెక్నికల్ గా ఈ సినిమా బ్రహ్మాండంగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ మార్కులు పడతాయి. అటవీ నేపథ్యంలో తెరకెక్కించిన సన్నివేశాలు తప్పకుండా విస్మయ పరుస్తాయి. థియేటర్ ని అడవిగా మార్చేసింది కెమెరా పనితనం. నేపథ్య సంగీతం కూడా కథకు, సన్నివేశాకు అనుగుణంగా సాగింది. దర్శకుడి ఉద్దేశం మంచిది. తన ఆలోచన బాగుంది. అయితే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా దాన్ని చెప్పలేకపోయాడు.
* ప్లస్ పాయింట్స్
రానా
విజువల్ ఎఫెక్ట్
గ్రాండియర్
* మైనస్ పాయింట్స్
ఎమోషన్ లేకపోవడం
బలహీనమైన కథనం
* ఫైనల్ వర్డిక్ట్: విజువల్ ట్రీట్