విశ్వక్‌సేన్‌కి అసలు ప్రొఫెషనలిజం తెలుసా? ఇలాంటి హీరోతో సినిమా చేసేది లేదంటూ... దర్శకుడు, నటుడు అర్జున్ సంచలన ఆరోపణలు చేశారు. విశ్వక్‌తో ఆయన ఓ సినిమా ఇటీవలే ప్రారంభించారు. అయితే.. షూటింగ్ కి విశ్వక్ రావడం లేదని, తనకు కోపరేట్ చేయడం లేదని, ఫోన్ చేసినా స్పందించడం లేదని... అర్జున్ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇక వంద కోట్లు ఇచ్చినా... విశ్వక్‌తో సినిమా చేయనంటూ ఆయన ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు.
విశ్వక్‌సేన్ ఎందుకిలా ప్రవర్తించాడన్న విషయం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. అర్జున్ కథ చెప్పినప్పుడు `ఆహా.. ఓహో` అన్న విశ్వక్... సడన్‌గా ఎందుకు ప్లేటు మార్చాడు? అనే విషయంపై అంతా ఆసక్తిగా చర్చించుకొంటున్నారు. అర్జున్ చెప్పిన కథ విషయంలో విశ్వక్‌కి ఎలాంటి డౌటూ లేదని, అయితే ఈ సినిమాలోని బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగులు విశ్వక్‌కి నచ్చలేదని, ఆ డైలాగులు మార్చమని అర్జున్‌కి చాలాసార్లు విశ్వక్ చెప్పాడని, అయినా అర్జున్ వినిపించుకోలేదని సమాచారం.
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. అనూప్ ని కూడా మార్చాలని విశ్వక్ సూచనలు అందించాడట. అంతే కాదు... చంద్రబోస్ రాసిన పాటలు సైతం విశ్వక్‌కి ఎక్కలేదని, ఈ విషయాలు అర్జున్ దగ్గర చాలాసార్లు చర్చించినా, ఫలితం లేదని, అందుకే... ఈ సినిమా నుంచి బయటకు వచ్చేశాడని చెబుతున్నారు. అర్జున్ లా... విశ్వక్ కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి, మీడియా ముందుకు వస్తే గానీ, అసలేం జరిగిందన్న విషయంలో ఓ క్లారిటీ రాదు.