తెలుగు ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో విలన్ వేషాలు వేస్తూ, తర్వాత హీరోగా మారి కామెడీ, ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ, మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీకాంత్. ఈ మధ్య విడుదల అయిన 'యుద్ధం శరణం' సినిమాలో విలన్ గా కూడా నటించాడు. తాజాగా హీరో శ్రీకాంత్ పై ఓ సైకో చేసిన దాడి కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే వెంకటేష్ అనే వ్యక్తి కొంత మంది ప్రముఖుల ఇళ్లల్లో వంట మనిషిగా పనిచేసేవాడు. మూడు సంవత్సరాల క్రితం హీరో శ్రీకాంత్ ఇంట్లో కూడా వంటమనిషిగా చేసాడు. అతని ప్రవర్తన నచ్చకపోవడంతో శ్రీకాంత్ ఫ్యామిలీ ఇంట్లో నుంచి పంపించేశారు. కాకపోతే శ్రీకాంత్ అంటే వెంకటేష్ కి పిచ్చి అభిమానం. తాజాగా శ్రీకాంత్ తన కలలోకి వస్తున్నాడని, ఎన్ని సార్లు కలవాలని వెళ్ళినా అనుమతించటం లేదని చెబుతూ, నిన్న శ్రీకాంత్ ఇంట్లో ప్రవేశించాడు.
వాచ్ మెన్ అడ్డుకోవడంతో అతన్ని కొట్టి, రెండు కార్లను ధ్వంసం చేసాడు. అదే టైం లో వాచ్ మెన్ పై దాడి చేసి, ఇంట్లోకి వెళ్ళాడు. ఆ సమయంలో శ్రీకాంత్ మెట్లు దిగి వస్తుండగా, మెడ పట్టుకుని మెట్ల పై తోసాడు. దీంతో శ్రీకాంత్ కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ దాడి జరిగిన సమయంలో ఇంట్లో భార్య, పిల్లలు ఎవరూ లేకపోవటం విశేషం.
సమాచారం అందుకున్న పోలీసులు, అరెస్ట్ చేసేందుకు వెళ్ళగా.. వాళ్ళపైనా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సైకోని అతి కష్టం మీద అరెస్ట్ చేశామని, అతని పై క్రిమినల్ కేసులు పెట్టామని పోలీసులు తెలిపారు.