తెలుగులో అగ్రహీరోల సినిమాలకు వుండే క్రేజ్‌ని ఓ డబ్బింగ్ సినిమా సంపాదించేసుకుంది. థియేటర్ల వద్ద క్యూ లైన్లు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇదంతా ఓ హాలీవుడ్ సినిమా కోసం కావడమే విశేషం. అడ్వాన్స్ బుకింగులే అసాధారణమైన విషయం. అలాంటిది, ఆ అడ్వాన్స్ బుకింగ్‌ల కోసం కూడా క్యూ లైన్లతో 'అవెంజర్స్ ఎండ్ గేమ్' అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. నేడే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది.
తెలుగులోనే కాదు, తమిళంలోనూ 'అవెంజర్స్' కోసం తమిళ తంబిలు రజనీకాంత్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నట్లే హంగామా చేస్తుండడం గమనార్హం. అన్నట్టు, తెలుగులో అవెంజర్స్ దెబ్బకి మే 1న విడుదల కావాల్సిన 'అర్జున్ సురవరం' వెనక్కి వెళ్ళిపోయిన విషయం విదితమే. లక్కు కలిసొచ్చి పెద్ద సినిమా ఏదీ రిలీజ్ పెట్టుకోలేదుగానీ, లేదంటే దాన్నీ వెనక్కి పంపించేసేవారేమో.
ఈ పరిస్థితిని చూసి ఆనందపడాలో ఆందోళన చెందాలో తెలియని పరిస్థితి. యంగ్ హీరోలు, హీరోయిన్లు 'అవెంజర్స్' సినిమాకి విపరీతమైన హైప్ తీసుకురావడంలో తమవంతు పాత్ర పోషించారు మరి. హాలీవుడ్ సినిమాలు మనకి కొత్తేమీ కాదు, అయితే 'అవెంజర్స్' లాంటి సాంకేతిక అద్భుతాలు అప్పుడప్పుడూ మన బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటుతాయి. సత్తా చాటడమేంటి? ఈసారి స్ట్రెయిట్ సినిమాలకే సవాల్ విసురుతుంటేనూ!