మలయాళ సినిమా `అయ్యప్పనుమ్ కోషియమ్` గిర గిర రౌండ్లు కొడుతోంది. హీరోలు, దర్శకులు అంతా మారిపోతున్నారు. చివరికి ఆ కథ.. పవన్ కల్యాణ్ దగ్గర ఆగింది. పవన్ ఈ సినిమా చేస్తే.. ఇక కావల్సిందేముంది? ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. కానీ.. ఈ సినిమా పవన్ చేస్తే.. చాలా ఈక్వేషన్లు మారిపోతాయి. నిజానికి ఈ కథ రవితేజ - రానా దగ్గరకు వెళ్లింది. వాళ్లు చేయడానికి రెడీ. రవితేజ `సెకండాఫ్ కూడా పూర్తిగా రెడీ చేసుకుని చెప్పండి` అన్నాడు. రానా అది కూడా అనలేదు. రవితేజ చేసినా, చేయకపోయినా, రానా ఈ సినిమా చేసేస్తాడు.
గ్యారెంటీ. అయితే పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇస్తే - రానా చేయడం కష్టమే. ఎందుకంటే.. రానా చేసే ప్రతీ సినిమా సురేష్ బాబు చేతుల్లోనే ఉంటుంది. స్క్రిప్టు దగ్గర్నుంచి, ప్రీ ప్రొడక్షన్ వ్యవహారాలు అన్నీ ఆయనే చూసుకుంటారు. ఆయన స్క్రిప్టు ఓకే చేయాలంటే ఏడెనిమిది వెర్షన్లు మారాలి. అదంతా టైమ్ టేకింగ్ ప్రొసెస్. పవన్ ఈ సినిమాని రెండు నెలల్లో పూర్తి చేయాలని అల్టిమేట్టం జారి చేశాడు. సురేష్ బాబు ఎంట్రీ ఇస్తే ఈ ప్రీ ప్రొడక్షన్ కే మరో రెండు నెలలు పడుతుంది. ఇంత లాగ్ చేయడం పవన్‌కి ఇష్టం లేదు. సో.. పవన్ గనుక ఈ రీమేక్ చేస్తే రానా ఈ ప్రాజెక్టుకి దూరం అవ్వడం ఖాయం. మరోవైపు పవన్ గనుక చేస్తానంటే.. రానా కూడా ఈ సినిమా చేయాలా, వద్దా? అనే విషయంలో తర్జన భర్జనలు పడతాడు. ఎందుకంటే.. పవన్ తో షూటింగ్ కాస్త ఇబ్బంది కరమైన వ్యవహారం. ఆయన చేతిలో చాలా సినిమాలున్నాయి. ఎప్పుడు ఈ సినిమాని కాల్షీట్లు కేటాయిస్తాడో, ఎప్పుడు మూడ్ బాలేక.. నో షూటింగ్ అంటాడో ఊహించలేం.
ఈ ఇబ్బంది `గోపాల గోపాల` సినిమా కోసం సురేష్ బాబు అనుభవించాడు. కాబట్టి... పవన్ ఉంటే.. రానాని సురేష్ బాబునే సైడ్ చేస్తాడన్న ప్రచారం జరుగుతోంది. చేస్తే ఈ సినిమా రవితేజ - రానాలు చేస్తారు. లేదంటే పవన్ - మరో యువ హీరో తో ఈ రీమేక్ పట్టాలెక్కుతుంది. అదే ఈ సినిమా లెక్క.