'బాహుబలి-2' గురించి దేశమంతా చర్చించుకుంటోంది. 27వ తేదీ రాత్రి నుంచే ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. నిన్న అధికారికంగా సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దేశంలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ, అదే 'బాహుబలి-2' సినిమా గురించి. వసూళ్ళ ప్రభంజనాన్ని చూసి ఆయా సినీ పరిశ్రమల్లోని ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోతున్నారు. ఖచ్చితంగా ప్రభంజనం ఉంటుందని భావించామనీ, అయితే తమ ఊహలకు అందనంత ప్రభంజనం తమను ఆశ్చర్యపరుస్తోందని వారు చెప్పడం 'బాహుబలి 2' సాధించిన గొప్ప విజయానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. నిన్నటికి వినిపించిన అంచనాల ప్రకారం 150 కోట్ల దాకా బాహుబలి వసూళ్ళు చేరుకున్నట్లుగా తెలియవస్తోంది. అయితే అవి 180 కోట్లుగా ఉండవచ్చునని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇది కేవలం తొలి రోజు వసూళ్ళు మాత్రమే. ఈ ప్రభంజనం ఇలాగే కొనసాగితే 1000 కోట్ల రూపాయల వసూళ్ళ మార్కుని చేరుకోవడం పెద్ద కష్టంగా కనిపించడంలేదని ప్రముఖ సినీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. వెయ్యి కోట్ల మార్క్ చేరుకుంటే, ఆ ఘనతను సాధించిన తొలి భారతీయ సినిమాగా 'బాహుబలి-2' రికార్డులకు ఎక్కుతుంది. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినీ ప్రముఖులు 'బాహుబలి' గొప్పతనాన్ని కొనియాడుతుండడం మన తెలుగువారందరం గర్వపడాల్సిన విషయం.