అంతా ఊహించినట్లుగానే తొలి రోజు రికార్డులు 'బాహుబలి ది బిగినింగ్' పరమయిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ల ధరల పెంపు, షోల సంఖ్య పెంచడం వంటివాటిని 'బాహుబలి' బాగా క్యాష్ చేసుకుంది. అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ, విదేశాల్లోనూ బాహుబలి ప్రభంజనమే సృష్టించిందని ట్రేడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. తెలుగు సినిమాకి సంబంధించినంతవరకు చూసుకుంటే ఇప్పటిదాకా ఏ సినిమా సాధించని వసూళ్ళను 'బాహుబలి' సాధించేస్తుందనడం నిస్సందేహం. తొలి రోజు రికార్డుల్ని 'బాహుబలి' క్రియేట్ చేస్తున్న వైనం చూస్తుంటే, మళ్ళీ ఇలాంటి సినిమా వస్తే తప్ప ఈలోగా ఇంకో సినిమా ఏదీ ఈ స్థాయిలో వసూళ్ళు సాధించలేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఓవరాల్‌గా అన్ని వెర్షన్లనూ కలుపుకుంటే తొలి రోజు 100 కోట్లపైనే 'బాహుబలి' సాధించిందని సమాచారమ్. కొందరైతే ఈ లెక్కని 150 కోట్లుగా చెబుతున్నారు. అధికారికంగా ఈ సినిమా వసూళ్ళపై ఇంకా ప్రకటన వెల్లడి కావాల్సి ఉంది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించడం ఒక్కటే కాదు, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తే, ఈ సినిమా కోసమే నటీనటులంతా ప్రాణం పెట్టేశారు. అలా 'బాహుబలి' అనేది ఓ సినిమాలా కాకుండా, ఓ యజ్ఞంలా అందరూ భావించినట్లయ్యింది. ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూడటం ఓ ప్రతిష్టాత్మకమైన అంశంగా భావిస్తున్నారు.