పైరసీ భూతాన్ని అడ్డుకోవడం ఎవ్వరి వల్లా కావడం లేదు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఈ భూతం ఏదో రకంగా సినీ రంగాన్ని ఆవహిస్తూనే ఉంది. స్మార్ట్ టెక్నాలజీ బాగా పెరిగిపోయిన ప్రస్తుతం తరుణంలో ఈ పైరసీ భూతాన్ని అడ్డుకోవడం అసాధ్యం అయిపోయింది. తాజాగా ఈ పైరసీ భూతం 'బాహుబలి' చిత్రాన్ని వదలలేదు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్ననే ఈ సినిమా లీక్ అయిపోయిందంటూ నెట్‌లో వార్తలు హల్ చల్ చేసేశాయి. 'బాహుబలి' సినిమా స్క్రీన్‌పై రన్నింగ్ అవుతుండగా వచ్చిన ఫోటోస్ కూడా నెట్‌లో సందడి చేసేశాయి. ఇది విన్న నెటిజన్లు షాక్‌కి గురై, నెట్ ముందు కూర్చొని 'బాహుబల లీక్', 'బాహుబలి పైరసీ' అంటూ సెర్చింగ్ మొదలెట్టేశారు. దాంతో నెట్‌లో ఈ రెండు పదాలు ట్రెండింగ్ అయిపోయాయి. అంతేకాదు సినిమాపై ఉన్న క్రేజ్ ఎంతో ఈ పదాలు వింటేనే తెలుస్తోంది. కానీ ఇంటర్నెట్‌లో అలాంటి వీడియోలు ఏమీ కానరాలేదు. అధికారికంగా ఎక్కడా సినిమా లీక్ అయ్యిందనే సమాచారమ్ కూడా రాలేదు. అంటే బాహుబలి టీమ్ ఈ సినిమా విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారో తెలుస్తోంది. ఏది ఏమైనా పైరసీ భూతాన్ని అడ్డుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఒక్కసారి స్క్రీన్‌పై సినిమా రన్ అయ్యిందంటే చాలు పైరసీ భూతం విరుచుకుపడుతుంది. ఈ సమస్యని ఎదుర్కొనేంందుకు బాహుబలి యంత్రాంగం ఇంకెన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి మరి.