బాహుబలి సినిమా గురుంచి చర్చించుకుంటున్నంతగా ఈ దేశంలో మరే ఇతర సినిమా గురించి చర్చించుకోవడం లేదు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అంశం ఆసక్తిదాయకమే. ఈ సినిమా నచ్చలేదని ఎవరన్నా అంటే వారిని జాలిగా చూస్తున్నవారే ఎక్కువ.
సరే, ఇంతకీ ఇక్కడ మనం చెప్పుకునేది బాహుబలి పార్ట్ 1 తొలి పోస్టర్ గురించి. నీటిలోంచి చెయ్యొక్కటే పైకి లేచి ఉండడం, ఆ చేతిలో ఒక పసికందు. ఈ పోస్టర్ దేశవ్యాప్తంగా విశేషంగా ఆకట్టుకుంది. దీనికి మూలం ప్రముఖ పెయింటర్ వడ్డాది పాపయ్య గారు 1977 దివిసీమ ఉప్పెన నేపధ్యంలో గీసినది. అది రాజమౌళికి స్ఫూర్తినిచ్చింది.
"ఒహో ఇది కూడా కాపీయేనా?" అని నిట్టూర్చే వారికి ఒకటే సమాధానం.
మనలో నూటికి 99 మందికి కర్ణుడికి ఉన్న శాపం లాంటింది ఉంటుంది. అదేమిటంటే... చదివింది, చూసింది, నేర్చుకున్నది సమయానికి గుర్తురాకపోవడం. రాజమౌళికి ఆ శాపం లేదు. తాను అనుకున్న కథని తెరకెక్కించడానికి ప్రపంచంలో తన అనుభవంలోకి వచ్చిన బెస్ట్ ని స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఆ మాటకొస్తే మనలో ఎవరమైనా అనుభవంలోకి వచ్చినదాన్ని స్ఫూర్తిగా తీసుకునే ఏ సృజన అయినా చెయ్యగలం. వాల్మీకి, వ్యాసుడు రామాయణ భారతాలు రాసారంటే ఆ కథలు వాళ్ల కళ్లముందు జరిగిన కరెంట్ ఎఫైర్స్.
ఒక బయోపిక్ తీసినట్టు బయోగ్రఫీ రాసారు. అలాగే దాదాపు అన్నీ. మనం విన్నదో, చూసిందో మనలోని సృజనకి బీజం వేస్తుంది. ప్రతి సృజనకి ఒక స్ఫూర్తి ఉంటుంది. వడ్డాది పాపయ్య గారికి నిజంగా ఇలాంటి ఫోటో ఎదో అప్పటి ప్యాపర్లో పడి ఆయనకి స్ఫూర్తినిచ్చి ఉండొచ్చు.