నటీనటులు: ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీధర్
దర్శకుడు: వేణు ఎల్దండి
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, దిల్ రాజు
సినిమాటోగ్రఫీ: వేణు ఆచార్య
సంగీతం: భీమ్స్
ఎడిటింగ్: మధు
రేటింగ్: 3/5
‘బలగం’ సినిమా మూడు విషయంలో ఆకర్షించింది. కమెడియన్ వేణు టిల్లు ఈ సినిమాతో దర్శకుడిగా మారడం, దిల్ రాజ్ లాంటి ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని నిర్మించడం, మంచి నటుడనే పేరు తెచ్చుకున్న ప్రియదర్శి ఇందులో ప్రధాన పాత్ర పోషించడం. ఇలా ఆసక్తికరమైన కాంబినేష్ లో వచ్చిన బలగం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది ? కమెడియన్ టిల్లు.. దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా ? ఇంతకీ బలగం కథ ఏమిటి ?
కథ:
సాయిలు (ప్రియదర్శి) ది తెలంగాణలో ఓ పల్లెటూరు. పెళ్లి చేసుకొని వచ్చే కట్నం డబ్బులతో తన అప్పులను తీర్చుకోవాలనేది సాయిలు ఆలోచన. అయితే అనుకోని కారణాలతో సాయిలు తాతయ్య కొమురయ్య (సుధాకర్ రెడ్డి) సడన్‌గా చనిపోతాడు. దాంతో పెళ్లీ ఆగిపోతుంది. కొమురయ్యకు ఇద్దరు కొడుకులు ఐలయ్య, మొగిలయ్య, ఒక కుమార్తె లక్ష్మి. లక్ష్మి భర్త నారాయణ తో ఐలయ్య, మొగిలయ్యలు ఇరవై ఏళ్ల క్రితం చిన్న గొడవ పడతారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య మాటలుండవు.
కొమురయ్య చనిపోయాడని తెలిసిన తర్వాత లక్ష్మి,నారాయణ..ఐలయ్య ఇంటికి వస్తారు. కర్మకాండల సమయంలో కాకులకు పెట్టే ముద్దలను కాకి ముట్టనే ముట్టదు. మరో వైపు అప్పుల ఇబ్బందుల్లో ఉన్న సాయిలుకి మామయ్య నారాయణకి చాలా ఆస్తులున్నాయని తెలుస్తుంది. దాంతో ఆయన కూతురు సంధ్య (కావ్యా కళ్యాణ్ రామ్)ని ప్రేమలో దించే ప్రయత్నం చేస్తాడు. అసలు సాయిలు ఎందుకు అప్పుల పాలవుతాడు?. కొమురయ్యకు పెట్టే ముద్దను కాకులు ఎందుకు ముట్టవు? చివరకు గొడవలు పడుతున్న కుటుంబ సభ్యులు ఎలా కలిశారు?అనేది బలగం కథ.
విశ్లేషణ :
ప్రాంతీయ మూలాలు వున్న కథల్లో జీవం వుంటుంది. ఈ మధ్య కాలంలో తెలంగాణ యాసనీ, సంస్కృతినీ అద్దం పట్టే కొన్ని కథలు వస్తున్నాయి. 'బలగం' అలాంటి ప్రయత్నమే. ఓ మనిషి చావు చుట్టూ నడిచే కథ ఇది. నిజంగా ఇలాంటి కథతో సినిమా చేయాలనుకోవడం సాహసమే. శవం ముందు జాగారం చేసే సమయంలో.. పాటలు పాడుకోవడం, పిట్ట ముట్టకపోతే.. కుటుంబ ఘనతను, బాధ్యతలూ చెబుతూ, కాకిని ఆహ్వానించడం.. ఇవన్నీ తెరపై కనిపిస్తాయి. తెలంగాణ సంస్కృతిలో భాగమైన వాళ్లకు ఆయా సన్నివేశాలన్నీ బాగా నచ్చే అవకాశం ఉంది.
అన్నాచెల్లెళ్ళ మధ్య బాండింగ్ చెప్పే సీన్, పొలం దగ్గర తాతయ్యకు ఇష్టమైన ప్రదేశంలో ప్రియదర్శి ఎమోషనల్ అయ్యే సీన్ ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్ లో కూడా ఎమోషన్ చక్కగా పంపడింది. అయితే ఈ కథంతా చాలా స్లో పేజ్‌లో సాగుతుంటుంది. చావు సన్నివేశాల్ని సుదీర్ఘంగా చూపిస్తూ వెళ్లారు.హీరో పాత్రలో బలం లేదు. తన ప్రేమ కథలు కూడా అంతగా ఆకట్టుకోవు. తెలంగాణ యాస, కట్టుబాట్లు, పద్దతులు తెలిసినవారికి ఈ కథ ఇంకాస్త ఎక్కువగా నచ్చుతుంది.
నటీనటులు :
ప్రియదర్శి సాయిలు పాత్రలో జీవించాడు. ఎమోషనల్ సీన్స్ లో తన నటన ఆకట్టుకుంటుంది. అయితే ఆ పాత్రని మరింత బలంగా మలిచే అవవకాశం వుంది.
కావ్యా కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజన్స్ బావుంది. నటన ఓకే. సుధాకర్ రెడ్డి పాత్ర గుర్తిండిపోతుంది. మిగతా నటులు పరిధి మేర చేశారు.
టెక్నికల్ :
పాటలు ఈ సినిమాకి ప్రధాన బలం. భీమ్స్ అందించిన బాణీలు బాగున్నాయి. మంగ్లీ పాడిన పాట ఆకట్టుకుంటుంది. కెమరాపనితనం, నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా వున్నాయి.
స్వతహగా హాస్యనటుడైన వేణు..తన దర్శకత్వంలో తొలి ప్రయత్నంలోనే ఇలాంటి నిజాయితీ గల కథ చెప్పాలనుకోవడం అభినందనీయమే.
ప్లస్ పాయింట్స్
కథ,
సంగీతం
తెలంగాణ నేపధ్యం
మైనస్ పాయింట్స్
నెమ్మదించిన కథనం
చాలా చోట్ల సాగదీత
ఫైనల్ వర్దిక్ట్ : భావోద్వేగాల బలం!