నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఓ డైలాగ్ టీజర్ ని కూడా విడుదల చేసింది చిత్రబృందం. కాకపోతే.... టైటిల్ ఏమిటన్నది ఇంకా ఖరారు కాలేదు. బయట మాత్రం బోలెడన్ని టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. మొన్నటి వరకూ `మోనార్క్` అనే టైటిల్ బాగా చక్కర్లు కొట్టింది. మా సినిమా పేరు అది కాదంటూ.. చిత్రబృందం క్లారిటీ ఇవ్వడంతో, అది కాస్త సద్దుమణిగిపోయింది. ఆ తరవాత.. 'బొనాంజా' అనే పేరు అనుకున్నారు. 'మొనగాడు' కూడా సర్క్యులేట్ అయ్యింది.
ఇప్పుడు మరో కొత్త టైటిల్ బయటకు వచ్చింది. అదే... 'డేంజర్'. ఈ టైటిల్ తో ఫ్యాన్స్... పోస్టర్లను కూడా రెడీ చేసేసి.. సోషల్ మీడియాలో వదులుతున్నారు. అయితే... చిత్రబృందం మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు. నిజానికి బాలయ్యతో ఇది వరకు చేసిన రెండు సినిమాల టైటిళ్లూ.. చిత్రీకరణకు ముందే ప్రకటించే అభిమానుల్లో ఉత్సాహం నింపాడు బోయపాటి. ఇప్పుడు మాత్రం రూటు మార్చాడు. టైటిల్ కోసం చాలా కసరత్తే సాగుతోంది. పైగా బోయపాటి స్టైల్ కూడా మారింది.
'వినయ విధేయ రామా', 'జయ జానకీ నాయక' అంటూ సాఫ్ట్ టైటిళ్లని ఎంచుకుంటున్నాడు. బాలయ్య కోసం అలాంటి సాఫ్ట్ టైటిలే పెట్టాలా? లేదంటే... `లెజెండ్`, `సింహా` లాంటి పవర్ ఫుల్ టైటిల్ తో వెళ్లాలా? అనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రారంభమయ్యే రోజున... టైటిల్‌ని ప్రకటించాలన్న ఆలోచనలో ఉన్నాడట. చూద్దాం... ఆఖరికి ఏది ఫిక్స్ అవుతుందో?