నందమూరి బాలకృష్ణ ఖాతాలో ఇటీవల సరైన హిట్ పడలేదు. ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ గా మిగిలిపోవడంతో.. ఆయన కొంచెం వెనుక బడ్డారు. బోయపాటి శ్రీను పరిస్థితి కూడా అంతే. `వినయ విధేయ రామా`తో బోయపాటి ఇమేజ్ దెబ్బతింది. ఇద్దరికీ ఓ సూపర్ హిట్ ఇవ్వాల్సిన అగత్యం, అవసరం ఏర్పడింది. దాంతో పాటు... తమ కాంబినేషన్ పై ఉన్న అంచనాలనూ నిలబెట్టుకోవాలి.
కాకపోతే.. బాలయ్య - బోయపాటి సినిమాకు ముందు నుంచీ ఆటంకాలే. ఇందులో సరైన హీరోయిన్ ని వెదికిపట్టుకోలేక, దొరికిన వాళ్లతో సర్దుకుపోయారు. ఇప్పటి వరకూ టైటిల్ ప్రకటించలేదు. పైగా బడ్జెట్ ఎక్కువైందన్న గుసగుసలు వినిపించాయి. దాంతో ఈ సినిమాపై క్రేజ్ తగ్గుతుందేమో అనుకున్నారు. కానీ.. అలా జరగలేదు. సరికదా.. ఈ సినిమాకు అనూహ్యమైన ఆఫర్లు వస్తున్నాయని టాక్. ముఖ్యంగా నైజాం ఏరియాని కైవసం చేసుకోవడానికి ఇద్దరు ముగ్గురు బయ్యర్లు తీవ్రంగా పోటీ పడుతున్నార్ట.
ఇది వరకు బాలయ్య సినిమాలకు ఇవ్వనంత రేటు ఈ సినిమాకి ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నార్ట. థియేటరికల్ రైట్స్ కోసం ఓ బడా నిర్మాత స్కెచ్ వేస్తున్నాడని తెలుస్తోంది. అటు బాలయ్యకూ, ఇటు బోయపాటికీ హిట్లు లేకపోయినా, ఈ సినిమా థియేటరికల్ రైట్స్ కి క్రేజ్ రావడానికి కారణం.. కాంబినేషన్ పుణ్యమే. ఓ టీజరో, ట్రైలరో బయటకు వస్తే.. అందులో బాలకృష్ణ విజృంభణ కనిపిస్తే - ఈ రేటు మరింత పెరిగిపోయే అవకాశం వుంది.