తమిళనాడుని తన పురిటి గడ్డగా బాలయ్య పేర్కొన్నారు. 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా తమిళ వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. తమిళనాడులో ఈ సినిమాని ఘనంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆడియో విడుదల వేడుకను చెన్నైలో ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. తెలుగు రాజు గౌతమీ పుత్ర శాతకర్ణి జీవిత గాథని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. ఇలాంటి సినిమా కథాంశం భారతీయులందరూ తెలుసుకోదగ్గ చారిత్రక నేపథ్యం కలదని చెప్పారు బాలకృష్ణ. ఈ ఏడాది ప్రధమార్ధంలో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగులో ఘనవిజయం సాధించింది. ముద్దుగుమ్మ శ్రియ హీరోయిన్‌గా నటించింది ఈ సినిమాలో. అలనాటి బాలీవుడ్ అందాల తార హేమమాలిని, బాలకృష్ణకు తల్లిగా నటించింది. తమిళ వెర్షన్‌కి తమిళనాడులో భారీగా క్రేజ్ ఏర్పడిందని సమాచారమ్. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ని ఇంటర్నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకుని చూడడానికి అక్కడి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఈ ఇంట్రెస్ట్ చూస్తుంటే 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా తమిళంలో కూడా మంచి విజయం సాధించేలానే అనిపిస్తోందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాజమౌళి 'బాహుబలి' సినిమా తమిళంలోనూ ఘనవిజయం సాధించడంతో 'గౌతమి పుత్ర శాతకర్ణి' తమిళ వెర్షన్ కూడా సంచలనాలు నమోదు చేయడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.