నందమూరి బాలకృష్ణకు ఆవేశం ఎక్కువ. కొన్నిసార్లు ఎందుకు మాట్లాడతారో, ఎలా మాట్లాడతారో కూడా అర్థం కాదు. అందుకే బాలయ్య వ్యాఖ్యలు చాలాసార్లు దుమారం రేపాయి. తాజాగా `భారత రత్న` పురస్కారం విషయంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు విమర్శలకు గురి అవుతున్నాయి. ఎన్టీఆర్‌కి భారత రత్న రావాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో ఆశ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకు భారత రత్న తీసుకురావాలని శతవిధాలా కృషి చేసింది. అయితే.. గత కొంతకాలంగా భారత రత్న అవార్డు విషయంలో బాలయ్య వైఖరి పూర్తిగా మారిపోయింది. ఓ సందర్భంలో `అది కాలి గోటితో సమానం` అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరోసారి.. అలాంటి కామెంట్లే చేశారు.
ఆదిత్య 369 చిత్రానికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బాలయ్య ఓ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత రత్న పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అది మా నాన్నగారి కాలి గోటితో సమానం. ఇచ్చిన వాళ్లకు మర్యాద గానీ, నాన్నగారికి కాదు`` అంటూ వ్యాఖ్యానించారు. దేశంలోనే భారత రత్న అత్యున్నత పురస్కారం. అలాంటి పురస్కారం విషయంలో ఇలా మాట్లాడతారా? అది కూడా రెండు సార్లు...? ఇదే విషయం సోషల్ మీడియాలో సర్కిల్ అవుతోంది. బాలయ్య ఇలా మాట్లాడడం సరికాదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓ వైపు ఎన్టీఆర్ కి భారత రత్న రావాలని.. ఆయన అభిమానులు, టీడీపీ పార్టీ కోరుకుంటుంటే - బాలయ్య మాత్రం ఆ అవార్డు ప్రతిష్టకే భంగం కలిగించే మాట్లాడడం సరి కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.