తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి'. బాలయ్య వందో చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే ది బెస్ట్ హిస్టారికల్ హిట్‌గా నిలిచింది. క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు చెన్నైలో విడుదల చేయనున్నారు. రేపే ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ని చెన్నైలో ఘనంగా నిర్వహించనున్నారు. తెలుగు రాజు, తెలుగు ఖ్యాతి అంటూ తెలుగులో ఈ సినిమాకి పబ్లిసిటీ ఇచ్చారు. మరి తమిళ వెర్షన్‌కొచ్చేసరికి అక్కడ ఏమని పబ్లిసిటీ ఇస్తారో అంటూ సర్వత్రా ఆశక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకి అక్కడ కనీ వినీ ఎరుగని రీతిలో పబ్లిసిటీ చేయనున్నారట. అందుకోసం చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేసిందట. రేపు జరగబోయే ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి డైరెక్టర్ క్రిష్‌తో పాటు, బాలయ్య కూడా హాజరు కానున్నారట. ఇంతవరకూ తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి తెలుగు ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నాయి. ఇకపై అలాగే మన తెలుగు సినిమాలను కూడా తమిళంలో విడుదల చేసి అక్కడ మన మార్కెట్‌ని మరింత పదిలం చేసుకోవాలనుకుంటోంది టాలీవుడ్. అంతేకాదు గతంలో 'వేదం' సినిమాతో తమిళ నాట విజయం సాధించిన ట్రేక్ రికార్డు క్రిష్‌కి ఉంది. అదే తరహాలో ఇప్పుడు 'శాతకర్ణి'తోనూ మరో హిట్ కొట్టాలనుకుంటున్నాడు క్రిష్. ఈ ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలయ్య సరసన శ్రియ కథానాయికగా నటించింది ఈ సినిమాలో. బాలీవుడ్ నటి హేమామాలిని శాతకర్ణికి తల్లిగా కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం పూరీ డైరెక్షన్‌లో బాలయ్య 'పైసా వసూల్' సినిమాలో నటిస్తున్నారు.