ఆహాలో బాలకృష్ణ ఓ షో చేస్తున్నారు అనగానే అంతా ఆశ్చర్యపోయారు. గీతా ఆర్ట్స్ అంటేనే మెగా కాంపౌండ్. అలాంటి చోట బాలయ్య షో చేయడం ఏమిటి? అనుకున్నారు. అయితే `అన్ స్టాపబుల్` అనే షోతో... బాలయ్య గట్టిగానే షాక్ ఇచ్చాడు. పైగా ఈ షో లాంచ్ చేస్తున్నప్పుడు బాలయ్యని అల్లు అరవింద్... అల్లు అరవింద్ ని బాలయ్య పరస్పరం తెగ పొగుడుకున్నారు. ఆహాలో.. ఓ మంచి షో కావాలి అనుకున్నప్పుడు బాలయ్య మైండ్ లోకి రావడం, బాలయ్య వెంటనే ఒప్పుకోవడంతో.. ఆహాకి ఈ షోతో సరికొత్త మైలేజీ రావడం ఖాయమైపోయింది. ఈ షో కోసం బాలయ్యకు కూడా భారీ ఎత్తున పారితోషికం ముట్టజెప్పినట్టు టాక్ వినిపిస్తోంది.
ఏదేమైనా.. బాలయ్యతో గీతా ఆర్ట్స్ అనుబంధం ఈ షోకి మాత్రమే పరిమితం కావడం లేదు. భవిష్యత్తులోనూ గట్టిగానే కొనసాగబోతోంది. బాలయ్యతో గీతా ఆర్ట్స్ ఓ సినిమా చేయబోతోందని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. ఇప్పటికే బాలయ్య కోసం కథలు సిద్ధం చేస్తున్నార్ట. ఇది వరకు గీతా ఆర్ట్స్ అంటే.. కేవలం చిరంజీవికి మాత్రమే అన్నట్టు ఉండేది. ఆ తరవాత యువ హీరోలతో సినిమాలు చేయడం మొదలెట్టారు. ఇప్పుడు అగ్ర హీరోలతోనూ, వేరే కాంపౌండ్ హీరోలతోనూ సినిమాలు చేయడం మొదలెట్టారు. గీతా ఆర్ట్స్ విషయంలో ఏమో గానీ, పరిశ్రమలో మాత్రం ఇది కచ్చితంగా శుభ సంకేతమే.