'పైసావసూల్' సినిమా టీజర్‌లో బాలకృష్ణ వాయిస్ కొంత ఇబ్బందికరంగా అనిపించింది. అయితే అది టీజరే కాబట్టి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదనుకున్నారు అభిమానులు. కానీ ట్రైలర్‌లోనూ బాలయ్య ఇబ్బందికరమైన వాయిస్‌తోనే డైలాగ్ చెప్పారు. ఊరమాస్ డైలాగుల్ని హై పిచ్‌లో బాలయ్య చెబితే ఆ కిక్ అద్భుతః అంటారు అభిమానులు. 'పైసావసూల్' ట్రైలర్ విషయానికొస్తే మాత్రం బాలయ్య చెప్పిన డైలాగులు బాగున్నా వాయిస్‌లో స్ట్రెంగ్త్ లేకపోవడం అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అభిమానులే కాదు తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు. ట్రైలర్ కట్ చేసిన విధానం బాగున్నప్పటికీ ఇదే వాయిస్ సినిమాలో కంటిన్యూ అయితే కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత కొద్ది రోజులుగా బాలకృష్ణ తన వాయిస్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. 'పైసావసూల్' సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటినుంచీ ఇదే పరిస్థితి. పోర్చుగల్ నుంచి సోషల్ మీడియాలో లైవ్ ద్వారా అభిమానులతో ముచ్చటించిన బాలయ్య అప్పట్లో చాలా ఇబ్బందిపడ్డారు బొంగురుపోయిన వాయిస్ కారణంగా. ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా సహజమే. కొద్ది రోజుల్లోనే సమస్య పరిష్కారమయిపోతుంది. బాలయ్యకు మాత్రం వాయిస్ ఇబ్బందికరంగా మారడం, ఆ ఇబ్బంది కొనసాగుతుండడం ఆశ్చర్యకరం. ఏదేమైనా ట్రైలర్ మాత్రం అభిమానులకి సూపర్బ్‌గా నచ్చేసింది. వాయిస్ విషయంలో మాత్రం క్లారిటీ రావడంలేదు.