సినిమా ఏదైనా, ఎవరితో అయినా.. వ్యాపారమే పరమావధి. ఎంత ఖర్చు పెట్టారు? ఎంతొచ్చింది? అనే బ్యాలెన్స్ షీట్ చూసుకోవడం తప్పనిసరి. ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే - లాభాలు తెచ్చిపెడితే, నిర్మాతల దృష్టిలో హిట్టుకిందే లెక్క. ఆ లాభాలేవో.. సినిమా విడుదలకు ముందే వచ్చేస్తే.. అంత కంటే కావల్సిందేముంది..? `బంగార్రాజు` విషయంలో ఇదే జరిగింది.
సోగ్గాడే చిన్ని నాయినకి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రం `బంగార్రాజు`. ఈసారి నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా తెరపై కనిపించబోతున్నాడు. ఆ రకంగా ఇది అక్కినేని మల్టీస్టారర్ అన్నమాట. ఈ సినిమాని జీ రూ.47 కోట్లకు కొనేసింది. అదీ క్లాప్ కొట్టకుండానే. కేవలం జీ వాళ్ల కోసమే నాగ్ ఈ సినిమా చేస్తున్నాడన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఇది నాగార్జున సొంత బ్యానర్ నుంచి చేస్తున్న సినిమా. తనకీ, చైతూకీ పారితోషికాలు పూర్తిగా పక్కన పెట్టేయొచ్చు. ఇతర కాస్టింగ్ కి మహా అయితే 5 కోట్లు అవుతుంది. ప్రొడక్షన్ కి 15 కోట్లు అయినా... 20 కోట్లలో సినిమా అయిపోతుంది. అంటే.. 27 కోట్ల లాభమన్నమాట. బంగారు బాతు గుడ్లంటే ఇవే కదా..?