ఈనెల 13న `బీస్ట్ ` విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. విజయ్ సినిమాల్లో కెల్లా ఇది భారీ బడ్జెట్ చిత్రం. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించాడు. `వరుణ్ డాక్టర్` లాంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు నెల్సన్. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాకపోతే.. `బీస్ట్` సినిమాని ఇప్పుడు ఓ కొత్త వివాదం చుట్టుకుంది. ఈ సినిమాని విడుదల చేయొద్దంటూ ముస్లిం సంఘాలు గొడవ చేస్తున్నాయి. ముస్లింలను టెర్రరిస్టులుగా ఈ సినిమాలో చూపించబోతున్నారన్నది వాళ్ల వాదన. అందుకే ఈ సినిమాని కొన్ని ఇస్లామిక్ దేశాలు నిషేధించాయి. తమిళనాడులోనూ ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. అక్కడ కొన్ని చోట్ల బీస్ట్ ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమాకి నెగిటీవ్ గా ప్రచారం మొదలెట్టారు. ఈ విషయం విజయ్ వరకూ వెళ్లింది. దాంతో ఆయన రంగంలోకి దిగారు.
అభిమానుల్ని హద్దుమీరొద్దని చెబుతూనే, నేతలు, సినిమా ప్రముఖులు, మత సంబంధ సంఘాలపై ట్రోల్స్ చేస్తే ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగిచ్చాడు విజయ్. మరోవైపు విజయ్ అభిమానులకు,యశ్ అభిమానులకూ మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. విజయ్ బీస్ట్ 13న వస్తే.. యశ్ కేజీఎఫ్ 2... ఈనెల 14న విడుదల అవుతోంది. అందుకే ఇద్దరు హీరోల అభిమానులు నువ్వా, నేనా అని కొట్టుకుంటున్నారు. ఒకరి సినిమాపై మరొకరు బురద చల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గొడవలు కూడా సినిమా ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.