ముంబై నుంచి వచ్చిన కథానాయికలు తెలుగు బట్టీ పట్టి మాట్లాడుతుంటారు. వాళ్ల తెలుగు పలుకులు విచిత్రంగా. వింతగా ఉంటాయి. తెలుగమ్మాయిలు అనిపించుకోవడానికీ, తెలుగు వాళ్లని ఆకట్టుకోవడానికీ.. ఆ మాత్రం తెలుగు నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు అదే సీన్ మన హీరోల విషయంలో రిపీట్ అవుతోంది. మన కథానాయకులు బాలీవుడ్ బాట పడుతున్నారు. పాన్ ఇండియా సినిమాలతో హడావుడి చేస్తున్నారు. బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలంటే మామూలు విషయం కాదు. అందుకే అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హిందీ భాష నేర్చుకునేందుకు ప్రత్యేకమైన కసరత్తులు చేస్తున్నారు.
ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ అదే చేస్తున్నాడు. `చత్రపతి` హిందీ రీమేక్ తో బెల్లంకొండ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో షూటింగ్ మొదలు కాబోతోంది. ఈలోగా బెల్లంకొండ హిందీ నేర్చుకోవడంలో దృష్టి పెట్టాడు. బెల్లంకొండ కోసం ముంబై ట్యూటర్ ని నియమించి, ఆన్ లైన్ ద్వారా హిందీ నేర్పిస్తున్నార్ట. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటాడట. అందుకే హిందీ నేర్చుకుంటాడని, భవిష్యత్తులోనూ బెల్లంకొండ మరిన్ని హిందీ చిత్రాలు చేస్తాడు కాబట్టి.. ఈ పాఠాలు అవసరమే మరి.