ఈ వారం విడుదలైన రెండు చిత్రాలు భారీ చిత్రాలు కావడం విశేషం. అలాగే ఈ రెండు చిత్రాలు కథానాయిక చుట్టూ తిరిగేవి కావడం మరో విశేషం. ఇంతకి ఆ రెండు చిత్రాలు ఏంటంటే- భాగమతి & పద్మావత్.
ముందుగా భాగమతి చిత్రం విషయానికి వస్తే- ఈ చిత్రంలో అనుష్క విశ్వరూపమే చూడొచ్చు. తనలోని నటనా ప్రతిభ చెప్పే విధంగా ఇందులోని భాగామతి పాత్ర ఉంటుంది. దర్శకుడు అశోక్ కూడా ఈ చిత్ర కథాంశాన్ని అనుష్కని దృష్టిలో పెట్టుకునే ఈ భాగమతి కథ రాయడం విశేషం.
ఇక ఈ సినిమా మొత్తం ఆమెని తన భుజాల పైన మోసింది అని చెప్పక తప్పదు, ఎందుకంటే సినిమా బిజినెస్ పరంగా కూడా ఈ సినిమాలో అనుష్క తప్ప మరెవరు లేదు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ చిత్రం నిలకడగా ఉండడంతో ఈ రోజు దాటితే కాని సినిమా బిజినెస్ పరంగా ఏంటి పరిస్థితి అనేది మనకి పూర్తిగా తెలియదు.
ఇక రెండవ చిత్రం పద్మావత్ విషయానికి వస్తే- ఇది తెలుగులో విడుదలైన డబ్బింగ్ చిత్రం అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఈ చిత్రం పేరిట జరుగుతున్న నిరసనలు, దాడుల నేపధ్యంలో ఈ చిత్రం పైన అందరికి ఆసక్తి నెలకొంది. ఇక సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే కొట్టింది.
అయితే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నుండి వచ్చిన గొప్ప చిత్రాలలో ఇది ఒకటి కాకపోయినప్పటికీ ఒక మంచి చిత్రంగా మాత్రం నిలిచిపోతుంది. టైటిల్ పాత్ర పోషించిన దీపిక పడుకునే, ఆమె భర్తగా నటించిన షాహిద్ కపూర్ అలాగే ప్రతినాయకుడు పాత్రలో మెరిసి అందరి మన్ననలు అందుకున్న రన్వీర్ సింగ్ తమ తమ పాత్రలో జీవించారు అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ చిత్రం వసూళ్ళ పరంగా మంచి ఫలితాలే రాబడుతుండడం పట్ల నిర్మాతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఈ వారం ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్.