ఎన్నో అంచనాలు, అనుమానాల మధ్య భీమ్లా నాయక్ విడుదలైంది. తొలి రోజే, తొలి ఆటకే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తొలి రోజు వసూళ్ల లెక్క ఇంకా తేలలేదు గానీ, ఆల్ టైమ్ రికార్డ్ అంటున్నారంతా. బాక్సాఫీసుకి ఇది పండగలాంటి వార్త. తెలుగు సినిమాకి మరో సూపర్ హిట్ అందించిన పవన్, పరోక్షంగా పెద్ద సినిమాలకు ఓ పాఠం కూడా నేర్పాడు.
నిన్నా మొన్నటి వరకూ పెద్ద సినిమాల విడుదలలన్నీ డోలాయమానంలో ఉన్నాయి. ఏపీలో టికెట్ రేట్లు పెంచితే గానీ, తమ సినిమాని విడుదల చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని, పెద్ద నిర్మాతలు వాపోయారు. ముఖ్యమంత్రి ని కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. పవన్ అలాంటివేం పట్టించుకోలేదు. మరో వారం, పది రోజులు ఆగితే, కొత్త జీవో వస్తుందని తెలిసినా, అప్పడు టికెట్ రేట్లు పెరుగుతాయని తెలిసినా, తన సినిమాని ముందే విడుదల చేశాడు. ఏపీలో టికెట్ రేట్లు తక్కువ ఉన్నంత మాత్రాన తన సినిమాని రావల్సిన వసూళ్లు రాకుండా పోవన్నది పవన్ నమ్మకం. ఇప్పుడు అదే నిజమైంది. సినిమాలో విషయం ఉంటే చాలు. జనాలు థియేటర్లకు వస్తారు. సూపర్ హిట్ సినిమాని ఏదీ అపలేదు. ఈ విషయాన్ని.. భీమ్లా నిరూపించాడు. మార్చిలో రాధేశ్యామ్, ఆర్.ఆర్.ఆర్ లాంటి పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ఇప్పుడు ఈ రెండు పెద్ద సినిమాలకూ కాస్త ఉపశమనం దక్కొచ్చు. ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నంత మాత్రనా.. అదేం పెద్దగా ప్రభావం చూపదన్న విషయం ఆయా నిర్మాతలకు అర్థమయ్యే ఉంటుంది.