సంక్రాంతి బరిలో RRR నిలవడంతో... మిగిలిన సినిమాలకు కంగారు పట్టుకుంది. 2022 సంక్రాంతి ప్లానింగ్ ముందే జరిగిపోయింది. ఏయే సినిమాలు వస్తాయన్న విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. అయితే.. సడన్ గా RRR పోటీకి దిగడంతో సమీకరణాలు మారిపోయాయి. RRR వస్తే.. రాధే శ్యామ్ పక్కకు వెళ్లిపోవడం దాదాపుగా ఖాయమైపోయింది. ఫిబ్రవరి 14న రాధే శ్యామ్ ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పుడు భీమ్లా నాయక్ సైతం... తప్పుకునే ఛాన్స్ వుందట.
పవన్ కల్యాణ్ - రానా కలసి నటించిన చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్టయిన `అయ్యప్పయుమ్‌కోషియమ్`కి ఇది రీమేక్. సంక్రాంతికి విడుదల చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఆఘ మేఘాల మీద చిత్రీకరణ మొదలెట్టారు. సంక్రాంతికి రెడీ అవుతుంది కూడా. సంక్రాంతికి రిలీజ్‌డేట్ ప్రకటించారు. అయితే RRR ని జనవరి 7న విడుదల చేస్తామని ప్రకటించడంతో ఇప్పుడు భీమ్లా నాయక్ కూడా సైడ్ ఇచ్చేయాలని భావిస్తున్నాడట. RRR.. చాలా పెద్ద సినిమా.
పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. అంతేకాదు.. సంక్రాంతి సినిమాలకంటే ముందు RRR వస్తుంది. 7న RRR వస్తే.. అది బాగా ఆడేస్తే.. ఆ హోరులో మిగిలిన సినిమాలేమాత్రం కనిపించవు. అందుకే.. ఇప్పుడు ఒకొక్క సినిమా విడుదల తేదీ విషయంలో పునరాలోచనలో పడిందని సమాచారం. రాధేశ్యామ్ బాటలోనే భీమ్లా నాయక్ కూడా నడవబోతోందని, త్వరలోనే భీమ్లా నాయక్ కొత్త విడుదల తేదీ ప్రకటిస్తారని తెలుస్తోంది.