ఫిబ్రవరి 25.. లేదంటే ఏప్రిల్ 1.. `భీమ్లానాయక్` ఫిక్స్ చేసుకున్న డేట్లు ఇవి. ఈ రెండింటిలో ఎప్పుడైనా భీమ్లా రావొచ్చు. చిత్రబృందం మాత్రం ఫిబ్రవరి 25నే వచ్చేద్దాం అనుకుంటోంది. దానికి తగ్గట్టుగానే కసరత్తులు మొదలెట్టింది. ముందుగా భీమ్లా నాయక్ అవుట్ పుట్ రెడీ చేసేసింది. ఫైనల్ కాపీ చేతికి వచ్చేసింది. ఈ అవుట్ పుట్ పవన్ కల్యాణ్ కీ చూపించారు. మంగళవారం రాత్రి పవన్ `భీమ్లా నాయక్` చూసేసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది.
మరోవైపు ట్రైలర్‌నీ కట్ చేసి పెట్టారు. 2 నిమిషాల 20 సెకన్ల పాటు సాగే ఈ ట్రైలర్... రెడీగా ఉంది. వదిలేయడమే ఆలస్యం. ఫిబ్రవరి 25న భీమ్లాని విడుదల చేద్దామనుకుంటే, ట్రైలర్ ఇప్పుడే వదిలేయాలి. లేదంటే మరీ ఎర్లీ అయిపోతుంది. అందుకే.. చిత్రబృందం డోలాయమానంలో పడింది. ఫిబ్రవరి 10 తరవాత.. రావల్సిన డేట్ పై ఓ క్లారిటీ వస్తుంది. 11 నుంచి ప్రమోషన్లు మొదలెట్టినా.. టైమ్ సరిపోతుంది. ఫిబ్రవరి 25కి ఎలాంటి ఢోకా ఉండదు. ఫిబ్రవరి 25నే విడుదల అనునుకుంటే, 11న ఫిక్సవుతారు. అప్పటి నుంచే ప్రమోషన్లు మొదలెడతారు. ఫిబ్రవరి 11న లేదా 12న భీమ్లా ట్రైలర్ విడుదల చేసే అవకాశం ఉంది. ట్రైలర్ గనుక వచ్చేస్తే.. 25న సినిమా ఉన్నట్టు. లేదంటే ఏప్రిల్ 1కి షిఫ్ట్ అయినట్టు లెక్క.