వెండి తెర బాద్ షా.. ఎన్టీఆర్ - బుల్లి తెరపై సందడి చేయబోతున్నాడు, యాంకర్ గా అవతారం ఎత్తబోతున్నాడు అనగానే అందరి కళ్లూ అటువైపు ఫోకస్ అయ్యాయి. నిజానికి బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలు తెలుగు నాట కొత్త. ఇలాంటి షోలు తెలుగులో ఎక్కవేమో అనుకొన్నారు. అయితే ఎన్టీఆర్ యాంకర్ అనేసరికి... బిగ్ బాస్ పై ఆసక్తి పెరిగింది. ఈ షోకి రూ.45 కోట్ల వరకూ బడ్జెట్ కేటాయించారని, తెలుగునాట అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రియాలిటీ షో ఇదే నని ప్రచారం జరిగింది. దాంతో.... అందరి కళ్లూ బిగ్ బాస్‌పైకి మళ్లాయి.
అత్యంత వైభవంగా బిగ్ బాస్ షో మొదలైంది. తొలి షోలో సెలబ్రెటీలను పరిచయం చేశాడు ఎన్టీఆర్. తన స్టైల్, తన ఎనర్జీ, తన మాట తీరు, తన డాన్స్‌తో.. బిగ్ బాస్‌ని వన్ మాన్ షో చేసేశాడు ఎన్టీఆర్. స్వతహాగా ఎన్టీఆర్ మంచి మాటకారి. ఆ నేర్పరితనం బిగ్ బాస్ వేదికపై చూపించాడు. బుల్లి తెరపై అరంగేట్రంలోనే అదరగొట్టేశాడు. అయితే.. ఈ పోటీలో పాల్గొన్న 12 మంది సెలబ్రెటీలలో స్టార్ హోదా ఉన్న వాళ్లు ఎవరూ లేకపోవడం ఆశ్చర్యపరిచింది. ముమైత్ ఖాన్, శివబాలాజీ లాంటి వాళ్లు ఉన్నా... వీళ్లెవరూ ఇప్పుడు ఫామ్ లో లేరు. తేజస్విని, ధన్‌రాజ్ లను మినహాయిస్తే.. కొంతమంది పేర్లు బుల్లి తెర వీక్షకులకు పరిచయమే లేదు. అలాంటప్పుడు ఈ పోగ్రాం ఏమేరకు రక్తి కడుతుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం ఒకరిద్దరు సెలబ్రెటీలకు స్టార్ హోదా ఉన్నా.. ఈ పోగ్రాంకి ఊపొచ్చేది. వీళ్లతో ఎన్టీఆర్ ఎలా నెట్టుకొస్తాడో చూడాలి. ఈ షోలో ఎన్టీఆర్ తప్ప సెలబ్రెటీలు ఎవరూ కానరాకపోవడంతో ఈ షోని రక్తి కట్టించాల్సిన బాధ్యత పూర్తిగా ఎన్టీఆర్‌పైనే పడిపోయినట్టైంది.