బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో రెండో అర్థ భాగం మరింత పేలవంగా సాగుతోంది. టాస్క్‌లు అయితే ఒకదాన్ని మించి ఇంకోటి చెత్త.. అనే విమర్శల్ని ఎదుర్కొంటున్నాయి. టాస్క్‌లలో ఎవరు గెలుస్తారు.? అన్న సస్పెన్స్ అయితే ఎవరికీ కలగడంలేదు. దానిక్కారణం, అన్నీ డ్రమెటిక్‌గా సాగుతున్నవే. కెప్టెన్సీ టాస్క్.. అనగానే గట్టి పోటీ వుండాలి. కానీ, ఎవరు కెప్టెన్ అవ్వాలన్నది ముందే బిగ్‌బాస్ డిసైడ్ అయిపోయినట్లు టాస్క్‌లు నడుస్తున్నాయి. దీంతో టాస్క్‌ల సందర్భంగా జరిగే డిస్కషన్లు టీవీ సీరియళ్ళను తలపించేస్తున్నాయి.
ఆ మాటకొస్తే, వాటిని టీవీ సీరియళ్ళతో పోల్చుతూ, సీరియళ్ళ స్థాయిని తగ్గించడం ఎంతవరకు సబబు.? అన్న చర్చ తెరపైకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో. మరీ ముఖ్యంగా అఖిల్ - మెహబూబ్ - సోహెల్‌ల మధ్య ఏ కన్వర్జేషన్ నడిచినా అదో పెద్ద డ్రామాగా మారుతోంది. హై ఓల్టేజ్‌లో యాక్షన్ క్రియేట్ చేస్తున్నట్లు హడావిడి చేసి, చివరికి తుస్సుమనిపించేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లోనూ అదే నడిచింది.
మధ్యలో పులిహోర కలపడానికి ప్రయత్నించి మోనాల్ గజ్జర్ కూడా అభాసుపాలవుతోంది. అబిజీత్, హారిక.. ఇలా ఎవరూ తక్కువ కాదన్నట్లు నడుస్తోంది డ్రమెటిక్ వ్యవహారం. ఎవరు ‘అతి’ చేస్తున్నారు.? అన్నదే డిస్కషన్ తప్ప, ఎవరు జెన్యూన్ అన్న చర్చే ఈసారి బిగ్‌హౌస్‌లో కనిపించడంలేదు. రాత్రికి రాత్రి ఈ షోని ముగించేస్తే మంచిదేమోనని వ్యూయర్స్ అభిప్రాయపడుతున్నారంటే ఈ సీజన్ ఎలా నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు.