ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమాల్లో చిరంజీవి `వాల్తేరు వీరయ్య` కూడా ఉంది. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ సినిమా ఫలితంపై దర్శకుడు బాబి పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఈసారి సూపర్ హిట్టు ఖాయమని, అభిమానులు ఈ విషయంలో అనుమానించాల్సిన పనిలేదని ధీమాగా చెబుతున్నాడు. ఆదివారం హైదరాబాద్ లో `వాల్తేరు వీరయ్య` దర్శక నిర్మాతలు మెగా అభిమానులతో భేటీ వేశారు. ఈ సందర్భంగా `వాల్తేరు వీరయ్య` షూర్ షాట్ హిట్టని బాబి... మెగా ఫ్యాన్స్‌కి మాట ఇచ్చేశాడు. మరోవైపు నిర్మాతలు కూడా ఇదే ధీమా వ్యక్తం చేశారు. థియేటర్ల విషయంలో.. ఎవరూ బెంగ పడాల్సిన పనిలేదని, కావల్సినన్ని థియేటర్లు అందుబాటులో ఉన్నాయని, ప్రచార కార్యక్రమాలు కూడా ముమ్మరంగా చేస్తామని నిర్మాతలు మెగా అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలొచ్చాయి. ముచ్చటగా మూడో పాట ఈ రోజు విడుదల కానుంది.