'బాహుబలి' తర్వాత మళ్ళీ అంతటి పెద్ద స్కేల్ చేసిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. సినిమాకి ఆదరణ కూడా బావుంది. మొదటి రోజు కలెక్షన్ చూసుకుంటే ఇండియన్ సినిమా రికార్డులన్నీ బద్దలైపోయాయి. అయితే ఇలాంటి ఘన విజయంపై బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మాత్రం పెదవి విప్పడం లేదు. కరణ్ జోహార్ తప్పితే మరో బాలీవుడ్ ప్రముఖుడు సినిమాపై ట్వీట్ చేసిన దాఖలాలు లేవు. చివరికి సినిమాలో నటించిన అలియా భట్. అజయ్ దేవగన్ కూడా సినిమా విడుదలైన తర్వాత ఒక్క మాట కూడా తమ సోషల్ మీడియాలో వెల్లడించలేదు.
అలియా భట్ తో ఆర్ఆర్ఆర్ టీం ఎలాంటి ఒప్పందం చేసుకుందో తెలీదు కానీ ఆమె ఒక్క ప్రెస్ మీట్ లో తప్పా మళ్ళీ కనిపించలేదు. రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ .. దేశం మొత్తం తిరిగారు. ఇప్పుడు సినిమా విజయం సాధించడంపై బాలీవుడ్ నుంచి పెద్ద రెస్పాన్స్ లేదు. ఇది వ్యూహాత్మకమౌనమేనని టాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాహుబలిని ఇండియా సినిమా కవర్ పేజీగా మార్చాడు రాజమౌళి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ముందుమాట లో చేరింది. దీంతో సహజంగానే మరొకరి ఆధిపత్యాన్ని భరించలేని బాలీవుడ్.. ఆర్ఆర్ఆర్ విజయంపై వ్యూహాత్మకమౌనం పాటిస్తుందనే అభిప్రాయం వ్యక్తమౌతుంది.