ప్రముఖ దర్శకుడు రాజమౌళి సహా పలువురు సినీ ప్రముఖులు 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాని ప్రత్యేకంగా తిలకించారు. చూసినవారంతా సినిమా మహాద్భుత దృశ్యకావ్యంలా ఉందని అన్నారు. ఇంత గొప్పగా తెరకెక్కించిన ఈ సినిమాకి క్రిష్ తీసుకున్న టైం చాలా తక్కువ. అందుకే రాజమౌళి ఇలా రికార్డు సమయంలో సినిమా పూర్తిచేసిన క్రిష్‌ని ప్రశంసలతో ముంచెత్తాడు. అంతే కాకుండా క్రిష్ నుంచి తాను చాలా నేర్చుకోవాల్సి ఉందని చెప్పాడాయన. అలాగే సినిమాలో కెమెరా పనితనం, విజువల్ ఎఫెక్ట్స్, బాలకృష్ణ నటన అన్నీ అద్భుతంగా కుదిరాయని రాజమౌళి అభిప్రాయపడ్డాడు. 'బాహుబలి' వంటి అద్భుత విజువలైజేషన్ మూవీని తెరకెక్కించి, ప్రపంచ ఖ్యాతి పొందిన రాజమౌళే ఈ సినిమా గురించి ఇంతలా పొగిడారంటే నిజంగా ఈ సినిమా అద్భుత దృశ్య కావ్యమే అని చెప్పాలి. అలాగే తెలుగువారంతా గర్వపడే సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' అని బాలకృష్ణ అభిమానులు నినదిస్తున్నారు. తెలుగు సినిమా ఉన్నంతకాలం 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా గురించి మాట్లాడుకుంటారని వారు చెప్పడం జరుగుతోంది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరి పాత్ర రిజిస్టర్డ్ కావడం మరో ప్రత్యేకత. ఎవరికి వారే తమ తమ పాత్రలకు ఎంతగా ప్రాణం పోశారో సినిమాని తెరపై చూస్తుంటే తెలుస్తోందంటూ అభిమానులు చెబుతున్నారు. మొత్తానికి అనుకున్నట్లుగానే 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా తెలుగు వారి సినిమాగా మంచి పేరు తెచ్చుకుంది.