`ఆచార్య` అవ్వగానే చిరంజీవి చేయబోయే సినిమా `లూసీఫర్` అనేది ఖాయమైపోయింది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. నిజానికి ఈ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం జరిగింది. ఈ రీమేక్‌ని చిరు పక్కన పెట్టారని చెప్పుకున్నారు. అయితే.. ఇటీవల మోహన్ రాజా పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం మోహన్ రాజాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేసింది. దాంతో.. `లూసీఫర్`పై అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి.
తన పుట్టిన రోజు సందర్భంగా... చిరుని కలుసుకున్న మోహన్ రాజా, ఈ సారి పూర్తి కథ చెప్పేశాడట. ఆ మార్పులూ, చేర్పులూ చిరంజీవికి నచ్చాయని, `ప్రొసీడ్` అంటూ పచ్చజెండా ఊపేశారని ఇన్ సైడ్ వర్గాలు తెలియజేశాయి. దాంతో తదుపరి పనుల్లో మోహన్ రాజా మునిగిపోయాడట. ఈ సినిమాకి కావల్సిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పనిలో మోహన్ రాజా బిజీ అయ్యాడు.
ఈ చిత్రం కోసం లక్ష్మీ భూపాలని మాటల రచయితగా ఎంచుకున్నారు. కథానాయికగా నయనతార పేరు గట్టిగా వినిపిస్తోంది. కీలకమైన పాత్రలకు నటీనటుల్ని ముందే ఫిక్స్ చేసుకుని, వాళ్ల డేట్ల కోసం ప్రయత్నాలు కూడా ఇప్పుడే ప్రారంభించేశారని సమాచారం. లొకేషన్ల రిక్కీ కూడా మొదలెట్టారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.