మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాకి రంగం సిద్ధమైపోయింది. 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' బయోపిక్‌లో చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చారిత్రాత్మక చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకి కథను తయారు చేస్తోంది పరుచూరి బ్రదర్స్. వీరి ఆధ్వర్యంలో కథ సిద్ధమైపోయిందట. ఇక పట్టాలెక్కడమే తరువాయి. త్వరలోనే ఈ సినిమా స్టార్టింగ్ డేట్‌ని ఫిక్స్ చేయనున్నారట చిత్ర యూనిట్. ఈ చిత్రంలో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిగా కనిపించేందుకు చిరంజీవి తనను తాను మౌల్డ్ చేసుకుంటున్నారట. రీ ఎంట్రీలో వచ్చిన సినిమా 'ఖైదీ నెంబర్ 150'తో రికార్డులు తిరగ రాసేశారు చిరంజీవి. డాన్సులు, ఫైట్లు అదరగొట్టేశారు. ఈ సినిమా చరిత్రకి సంబంధించినది కాబట్టి, ఆయన పాత్ర కొంచెం పవర్ ఫుల్‌గా ఉండబోతోంది. ఈ సినిమాలో చిరుతో జోడీ కట్టే ముద్దుగుమ్మ కోసం పరిశీలన జరుగుతోంది. ముద్దుగుమ్మ అనుష్కకే ఈ సినిమాలో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదంటే బాలీవుడ్ నుండి మరెవరైనా కొత్త భామల్ని ఎంపిక చేస్తారా అనేది సస్పెన్సే. 150వ చిత్రాన్ని నిర్మించిన రామ్ చరణే ఈ సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది.