''నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను.కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు'' ఇప్పుడు ట్రెండ్ అవుతున్న డైలాగ్ ఇది. చిరు ట్విట్టర్‌లో.. ఈ డైలాగ్ ని పోస్ట్ చేశారు.
చిరు రాజకీయాలకు దూరమై చాలా కాలమైన నేపథ్యంలో ఈ ట్వీట్... సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. అయితే ఇది చిరు తాజా చిత్రం `గాడ్ ఫాదర్`లోని డైలాగ్. త్వరలోనే `గాడ్ ఫాదర్` ట్రైలర్ రాబోతోంది. అందులోని ఇదో డైలాగ్. అయితే.. ఈసినిమాలో ఇలాంటి పొలిటికల్ పంచ్‌లు చాలా ఉన్నాయట. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ, వాటి విధానాలపై గాడ్ ఫాదర్ చాలా సెటైర్లు వేశాడని టాక్. ఇవన్నీ... గాడ్ ఫాదర్‌కి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల మాటల రచయితగా పనిచేశారు. `నేనే రాజు - నేనే మంత్రి` చిత్రంలో ఆయన రాసిన పొలిటికల్ పంచ్‌లు బాగా పేలాయి. ఆసినిమా విజయంలో భూపాల మాటలు కీలక పాత్ర పోషించారు. ఆ తరవాత.. భూపాల రాసిన పొలిటికల్ డ్రామా ఇదే. కాబట్టి... పొలిటికల్ సైటైర్లు ఈ సినిమా నిండా వినిపించడం ఖాయం. ట్రైలర్‌లో మరిన్ని కాంట్రవర్సీ డైలాగులు పడబోతున్నాయని సమాచారం అందుతోంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబరు 5న విడుదల కానుంది.