అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ థియేటర్లు తెరచుకోవడానికి ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. దాంతో.. టాలీవుడ్ కి కొత్త జోష్ వచ్చింది. అయితే... ఇక్కడితో సరిపోదు. చిత్రసీమను వెంటాడుతున్న సమస్యలు చాలా ఉన్నాయి. అందులో మొదటిది.. ఏపీలో టికెట్ రేట్లకు సంబంధించిన సమస్య. ఏపీలో.. టికెట్ రేట్లు తగ్గిస్తూ.. ఏప్రిల్ లో ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. అది పెద్ద సినిమాలకు శాపంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. అందుకే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో విషయమై.. జగన్ ని సంప్రదించి, టాలీవుడ్ కి అనుకూలమైన నిర్ణయం తీసుకోవాల్సివుంది. అందుకే చిరు ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు కొందరు... జగన్ ని కలుసుకొబోతున్నారు. అందుకు సంబంధించిన అప్పాయింట్ మెంట్ కోసం టాలీవుడ్ సంప్రదింపులు మొదలెట్టిందని సమాచారం.
మరోవైపు కేసీఆర్ ని కూడా కలుసుకునే అవకాశం ఉంది. లాక్ డౌన్ సమయంలో థియేటర్ల కరెంట్ బిల్లుల విషయంలో మినహాయింపు ఇవ్వాల్సిందిగా టాలీవుడ్ ముఖ్యమంత్రులను కోరనుంది. అంతేకాదు.. షూటింగులు, అనుమతులు, వినోదపు పన్ను.. ఇలాంటి ఇష్యూలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ఆగస్టు నుంచి.... పెద్ద సినిమాల తాకిడి పెరగబోతోంది. ఈలోగా... ఈ విషయాలపై క్లియరెన్స్ తెచ్చుకోవాలన్నది టాలీవుడ్ ఆశ.. ఆకాంక్ష. మరి ఏం జరుగుతుందో? టాలీవుడ్‌పై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాంటి వరాలు కురిపిస్తారో చూడాలి.