చిరంజీవి రీ ఎంట్రీలో వచ్చిన సినిమా 'ఖైదీ నెంబర్ 150'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. అభిమానుల కోలాహలంతో ఎంతో ఆహ్లాదంగా జరిగింది ఆ ఫంక్షన్. సినిమా విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంత పెద్ద విజయాన్ని అందించిన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు 'థ్యాంక్స్ మీట్' ఏర్పాటు చేయాలనుకుంటోంది 'ఖైదీ' టీమ్. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన దాసరి నారాయణరావు సమక్షంలోనే థ్యాంక్స్ మీట్ కూడా జరిగితే బావుంటుందని చిరంజీవి అనుకున్నారు. అనుకోకుండా దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. ఆయన కోలుకున్నాకనే థ్యాంక్స్ మీట్ నిర్వహించాలనీ, ఆయన లేకుండా నిర్వహించకూడదని చిరంజీవి తాజాగా నిర్ణయం తీసుకున్నారట. అయితే థ్యాంక్స్ మీట్ పెడతామని మాట ఇచ్చి, తప్పారంటూ గుసగుసలు వినవస్తున్న వేళ, మెగా కాంపౌండ్‌లో థ్యాంక్స్ మీట్‌పై సమాలోచనలు జరుగుతున్నాయని సమాచారమ్. దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి, ఈ నెలాఖరులోనే ఆయన సమక్షంలో థ్యాంక్స్ మీట్‌ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారని తెలియవస్తోంది. ఇంకోవైపున రీ-ఎంట్రీలో వంద కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి టాలీవుడ్‌లో ఎప్పటికీ తనదే నెంబర్ వన్ పొజిషన్ అని వసూళ్ళతో చెప్పకనే చెప్పేశారు.