ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, అతి తక్కువ కాలంలోనే ఆ పార్టీని భూస్థాపితం చేసేశారు చిరంజీవి. ఆ తరవాత కాంగ్రెస్ లో చేరినా.. చాలా కాలంగా ఆయన రాజకీయాల పరంగా యాక్టీవ్ గా లేరు. రాజకీయాల గురించి ఆయన మాట్లాడడం మానేశారు. దాదాపుగా రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న వైఖరి కనిపించారు.
అయితే.. ఇప్పుడు మళ్లీ చిరు ఆలోచనలు మారబోతున్నట్టు, ఆయన రాజకీయాల్లోనూ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఆయన తన తమ్ముడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారన్నది టాక్. ఇదేదో గాలివాటంగా పుట్టిన వార్త కాదు. జనసేన పార్టీలో కీలకనేత నాదెండ్ల మనోహర్ నోటి నుంచే ఈ విషయం జారింది. `తమ్ముడు పవన్‌కి ఆన్నయ్య చిరంజీవి అన్ని విధాలా మద్దతు ఇవ్వబోతున్నారు` అనే సంకేతాన్ని నాందెడ్ల ఇచ్చేశారు. అంటే.. రాజకీయంగానూ... చిరు పవన్‌కి మద్దతు తెలుతుతారన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ.
ఆయన మద్దతు నేరుగానా? నైతికంగానా? అన్నది పక్కన పెడితే.. చిరంజీవి - పవన్ కల్యాణ్‌లు కలిస్తే.. రాజకీయ చిత్రం మారే అవకాశం వుంది. చిరు ఇప్పటికిప్పుడు పవన్ పార్టీ జెండా మోసే అవకాశం లేదు. కాకపోతే... `నా తమ్ముడికి నేనున్నా` అనే ఒక్క ప్రకటన చాలు. అభిమానుల్లో, ముఖ్యంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రావడానికి. మరి చిరంజీవి ఆ మాట ఎప్పుడంటారో చూడాలి.