టాలీవుడ్ టాప్ స్టార్లు... సినిమాల మీద సినిమాల్ని ఒప్పుకోవడం చిత్రసీమని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఓ సినిమా తరవాత మరో సినిమా అనే పద్ధతికి దాదాపుగా చెక్ పెట్టేశారు. ఒకేసారి రెండు మూడు సినిమాల్ని పట్టాలెక్కించి, అన్ని సినిమాలూ సమాంతరంగా పూర్తి చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. ఈ విషయంలో చిరంజీవి, ప్రభాస్ ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారనిపిస్తోంది.
చిరంజీవి చేతిలో చాలా సినిమాలున్నాయి. భోళా శంకర్, గాడ్ ఫాదర్ తో పాటుగా బాబితో సినిమా ఒకేసారి చేస్తున్నాడు చిరు. వీటన్నింటితో పాటుగా `ఆచార్య` ఉండనే ఉంది. మారుతి, వెంకీ కుడుముల కథలకు కూడా ఆయన ఓకే చెప్పేశారు. ఆ సినిమాలు కూడా త్వరలో పట్టాలెక్కబోతున్నాయి. చిరు తన కెరీర్ ప్రారంభంలో ఒకేసారి ఇన్ని సినిమాలు చేశాడేమో గానీ, స్టార్ గా మారాక మాత్రం చేయలేదు.
మరోవైపు ప్రభాస్ కూడా అంతే. `రాధేశ్యామ్` జరుగుతుండగానే `ఆదిపురుష్`,`సలార్` చిత్రాలు సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. తాజాగా `ప్రాజెక్ట్ కె`కూడా మొదలెట్టాడు. సందీప్‌రెడ్డి వంగాతో ఓ సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. ఇప్పుడు మారుతి సినిమా కూడా ఒప్పేసుకున్నాడు. ఇలా... ప్రభాస్ కూడా ఊపిరి సలపనంత బిజీ స్టార్‌గా మారిపోయాడు. రవితేజ సైతం.. ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు చేస్తుండడం విశేషం. మొత్తానికి టాప్ హీరోల మైండ్ సెట్ లో మార్పు వచ్చింది. ఇది పరిశ్రమకు శుభ శకునమే.