తండ్రి మెగాస్టార్... తనయుడు మెగా పవర్ స్టార్. వీరిద్దరినీ ఒకేసారి తెరపై చూడడం అభిమానులకు పండగే. మగధీర, ఖైదీ నెం.150లలో ఆ అవకాశం వచ్చింది. అయితే ఇవన్నీ గెస్ట్ రోల్సే. తొలిసారి వీరిద్దరూ ఓ పూర్తి స్థాయి సినిమాలో కలసి నటించనున్నారు. `ఆచార్య`లో రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. అక్టోబరులో ఆచార్య కొత్త షెడ్యూల్ మొదలవ్వనుంది. ఈసారి సెట్లోకి చరణ్ అడుగుపెట్టనున్నాడని సమాచారం.
ఈ సినిమాలో చరణ్ ఎంట్రీ ని చిరు అధికారికంగా ఖరారు చేసేశారు. ``చరణ్‌తో కలిసి నటిస్తే చూడాలన్నది సురేఖ కోరిక. ఆచార్యతో ఆ అవకాశం వచ్చింది. మళ్లీ ఇలాంటి కథ ఎప్పుడు దొరుకుతుందో, ఈ అవకాశం ఎప్పుడు వస్తుందో చెప్పలేను. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదని అనుకున్నాం. అందుకే రాజమౌళిని అడిగి డేట్లు సర్దుబాటు చేసుకున్నాం`` అని చిరు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కోసం చరణ్ పై ఓ ఫొటో షూట్ కూడా నిర్వహిస్తున్నారని సమాచారం. ఈ ఫొటో షూట్ ద్వారా చరణ్ గెటప్ ఖాయం కానుంది. చరణ్ పక్కన రష్మికని కథానాయికగా ఎంచుకున్నారని ప్రచారం సాగుతోంది. అయితే.. చిత్రబృందం ఈ విషయంలో ఇంకా స్పందించలేదు.