ఈ అభిమానం, ఇదే నాలో ఉత్సాహం నింపుతోందంటూ 'ఖైదీ నెంబర్ 150' సినిమాపై అభిమానులు పెట్టుకున్న అంచనాలు, తనపై అభిమానులు చూపుతున్న ఆదరాభిమానాలతో చిరంజీవి ఉప్పొంగిపోయారు. 'ఖైదీ' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చిరంజీవి ప్రసంగం ఉద్వేగభరితంగానే కాదు, చాలా ఉత్సాహంగా కూడా సాగింది. 'ఇంద్ర' సినిమాలో డైలాగ్ చెబుతూ, అలాగే ఎన్నో కథలు విన్నప్పటికీ తన నుంచి వచ్చే సినిమా అభిమానుల్ని అలరించేలా, వారికి వింధుభోజనంలా వుండాలనే ఆలోచనతోనే ఎక్కువ కాలం తాను కూడా వెయిట్ చేయాల్సి వచ్చిందని చిరంజీవి అన్నారు. చిరంజీవి అలా మాట్లాడుతోంటే అభిమానులు తమని తాము మైమర్చిపోయారు. అంతకు ముందు పలువురు సినీ ప్రముఖులు 'ఖైదీ' సినిమా గురించి ఎన్నో విశేషాలు చెప్పారు. దర్శకుడు వినాయక్, చిరంజీవిని అన్నయ్య అని సంబోదిస్తూనే, తనకు తండ్రి తర్వాత తండ్రిలాంటివారని ఉద్వేగానికి లోనయ్యాడు. లక్ష మందికి పైగా ఈ వేడుకను తిలకించేందుకు అభిమానులు రావడంతో ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. చాలామంది అభిమానులు స్థలం సరిపోక కొంచెం ఇబ్బంది పడ్డారు. అభిమానులు సముద్ర కెరటాల్లా ముందుకొచ్చేయడంతో వీవీఐపీల గ్యాలరీ కూడా అభిమానులతోనే నిండిపోయింది. చిరంజీవి ప్రసంగం స్టార్ట్ అయ్యేసరికి వేదిక మీదకు కూడా అభిమానులు చేరుకున్నారు. అభిమానుల అత్యుత్సాహం కారణంగా ఈవెంట్ కాస్త తొందరగానే ముగియాల్సి వచ్చింది. పోలీసులు అభిమానుల్ని కంట్రోల్ చేయలేక, చిరంజీవికి విజ్ఞప్తి చేసి ఈవెంట్ తొందరగా ముగిసేలా చేయగలిగారు.