ఈమధ్య.. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలోనూ, కొత్తకథల్ని ఒప్పుకోవడంలోనూ... తెగ స్పీడు చూపిస్తున్నాడు మెగాస్టార్. ఒకటా రెండా...? తన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఆచార్య, గాడ్ ఫాదర్, భోళాశంకర్... ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. బాబి సినిమాకూడా ఈమధ్యే పట్టాలెక్కింది. మారుతి చెప్పిన కథని చిరు ఓకే చేశాడని వార్తలొస్తున్నాయి. వెంకీ కుడుముల కథకూ చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం మొదలైంది. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయో, అసలు పట్టాలెక్కుతాయో లేదో కూడా తెలీదు. ఈలోగా ఈ జాబితాలో మరో దర్శకుడి పేరు వచ్చి చేరిపోయింది. తనే బోయపాటి శ్రీను.
అఖండ హిట్ తో ఫుల్ రేంజ్‌లోకి వచ్చేశాడు బోయపాటి. అఖండ చిరంజీవికి పిచ్చపిచ్చగా నచ్చేసిందని, అందుకే బోయపాటి శ్రీనుని పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడని టాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. నిజానికి చిరు - బోయపాటి కాంబో ఎప్పుడో రావాల్సింది. చిరు 152వ సినిమాగా ప్రకటించారు కూడా. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాల్సింది. కానీ... వినయ విధేయ రామా ఫ్లాప్ అవ్వడంతో చిరు రిస్క్ చేయలేకపోయాడు. అలా... చిరుతో సినిమా చేసే అవకాశాన్ని బోయపాటి కోల్పోయాడు. ఇప్పుడు అఖండ హిట్ అయ్యింది కదా.. మళ్లీ చిరుతో సినిమా చేసేంత ధైర్యం వచ్చింది. అయితే చిరు ముందు చాలా క్యూ ఉంది. అదంతా పూర్తయి, బోయపాటి కోటా వచ్చేసరికి టైమ్ పడుతుంది. ఈలోగా రాజులెవరో, మంత్రులెవరో?