చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాక... ఖైది నెంబర్ 150 రూపంలో సూపర్ హిట్ వచ్చింది. సైరా... ఓకే అనిపించుకొంది. కానీ ఫ్యాన్స్ లో ఎక్కడో అసంతృప్తి. ఆ తరవాత వచ్చిన ఆచార్య సరే సరి. చిరు కెరీర్‌లోనే ఇలాంటి డిజాస్టర్ చూడలేదని ఫ్యాన్సే అంటున్నారు. ఈ నేపథ్యంలో చిరు ఆచి తూచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసినట్టైంది.
అయితే చిరు చేతిలో ఉన్న లైనప్ పై కూడా ఫ్యాన్స్ సంతృప్తిగా లేరు. బాబితో ఓ సినిమా చేస్తున్నాడు చిరు. బాబి.. ఏసీ, డీసీ డైరెక్టర్. తనేం సూపర్ హిట్లు ఇవ్వలేదు. ఎబౌ ఏవరేజ్‌లే ఇచ్చాడు. అయినా సరే... చిరు నమ్మి అవకాశం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మెహర్ రమేష్ భోళా శంకర్‌పై ముందు నుంచీ ఎవరికీ నమ్మకాల్లేవు. గాడ్ ఫాదర్ ని చిరు.... లూసీఫర్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. గాడ్ ఫాదర్ ని ఇది వరకే తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ రూపంలో చూసేశారు. ఆ కథతో ఇప్పుడు కనెక్ట్ అవుతారా? అనేది అనుమానం. ఆ తరవాత వెంకీ కుడుముల తో ఓ సినిమా చేయబోతున్నాడు. యంగ్ టాలెంట్ కి అవకాశాలు ఇవ్వడం మంచి విషయమే. కానీ... ఇలాంటి పరిస్థితుల్లో, చిరు ఇమేజ్‌ని మ్యాచ్ చేసే దర్శకులతో పని చేయాలి. కానీ చిరు అదేం పట్టించుకోవడడం లేదు.
ఇప్పుడు మారుతికి ఛాన్స్ ఇచ్చాడు చిరు. మారుతితో ఓ సినిమా చేస్తున్నానని పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించేశాడు. మారుతి మంచి సినిమాలు తీశాడు. కానీ కొత్తవారితో. మిడిల్ రేంజ్ హీరోలతో. వెంకటేష్ లాంటి అగ్ర హీరో ఆఫర్ ఇచ్చినప్పుడు... మారుతి చేతులు ఎత్తేశాడు. పెద్ద హీరోల్ని తాను హ్యాండిల్ చేయగలడో, లేదో ఇప్పటి వరకూ తెలీదు. అలాంటి దర్శకుడికి అవకాశం ఇవ్వడం.. మెగా అభిమానుల్ని కంగారు పెడుతోంది. చిరు ప్రస్తుతం బోయపాటి, త్రివిక్రమ్ లాంటి వాళ్లతో పనిచేయాలి. అప్పుడు ఆ సినిమాలకు ఓ మైలేజీ వస్తుంది. అలా కాదని మీడియం రేంజు దర్శకులకు ఓకే చెబుతున్నాడు. ఇది నూటికి నూరు పాళ్లూ రిస్క్ వ్యవహారమే. మరి ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయన్నది చూడాలి.