ఎప్పటి నుంచో టాలీవుడ్ ఎదురు చూస్తున్న ఆ అడుగు పడింది. ప్రభుత్వానికీ, పరిశ్రమకు మధ్య ఉన్న ఆ చిన్న గ్యాప్ తొలగిపోయింది. చిరంజీవి ఓ బృందాన్ని వెంటబెట్టుకుని, ముఖ్యమంత్రి జగన్ ని కలవడం, ఆయన సానుకూలంగా స్పందించడం.. ఆశావాహమైన పరిణామం. అయితే ఈ భేటీ ముగిశాక చాలామంది చాలారకాలుగా స్పందించారు. ముఖ్యంగా చిరంజీవి లాంటి మెగాస్టార్.. ముఖ్యమంత్రి ముందు చేతులు జోడించి, వేడుకోవడం.. `ఆదుకోండి..` ప్రాధేయ పడడం... చాలామందికి రుచించడం లేదు. ఒకరి ముందు `దేహీ..` అన్నట్టు ప్రవర్తించడం జీర్ఙించుకోలేకపోతున్నారు.
నిజానికి చిరంజీవికి అంత అవసరం ఏమొచ్చింది? ఆయన టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో. పది తరాల పాటు తరగని ఆస్తి వుంది. అయినా సరే.... తగ్గి ఉన్నాడంటే, అది ఆయన కోసం కాదన్నది అభిమానుల మాట. పరిశ్రమ ఇప్పుడు కష్టాల్లో ఉంది. పెద్ద సినిమాలు చాలా నష్టపోతున్నాయి. ఆ ప్రభావం చిన్న సినిమాలపైనా ఉంది. వంద సినిమాలు తయారవుతుంటే, అందులో చిన్న సినిమాల వాటా 80. పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. చిన్న సినిమాలు బలైపోవడం ఖాయం. నిర్మాతల తరుపున, హీరోల తరపున, మొత్తం పరిశ్రమ కోసం ఆయన తగ్గాల్సివచ్చిందన్నది ఫ్యాన్స్ అభిప్రాయం. పరిశ్రమకూ ప్రభుత్వానికీ మధ్య ఉన్న చిన్న గీతని చెరిపేయడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఆ బాధ్యత చిరంజీవి తన భుజాన వేసుకున్నారు. ఈ భేటీతో పరిశ్రమ సమస్యలన్నీ చెరిగిపోతే... ఆ క్రెడిట్ మొత్తం చిరుకే ఇవ్వాలి. అందుకు ఆయనొక్కడే అర్హుడు కూడా. సో.. చిరు అలా ప్రవర్తించడంలో తప్పేం లేదు.
అయినా త్రివిక్రమ్ ఎప్పుడో అన్నారు కదా. `ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు` అని.