కరోనా వల్ల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చాలా సినిమాల షూటింగులు, రిలీజులు ఆగిపోయాయి. ఇప్పుడే మెల్లమెల్లగా పరిశ్రమ కుదురుకుంటోంది. అయితే... దాని ప్రభావం మాత్రం చాలా సినిమాలపై ఉంది. ముఖ్యంగా షూటింగులు ఆలస్యం అయ్యాయి. దాని వల్ల బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఆర్టిస్టుల కాల్షీట్లు మళ్లీ దొరకడం గగనమైపోవడం, అడ్వాన్సులు ఆగిపోవడం, వడ్డీల భారం పెరిగిపోవడం, వేసిన సెట్లు పాడైపోయి, మళ్లీ కొత్తగా సెట్స్ ని నిర్మించడం.. ఇలా చాలా చాలా కారణాల వల్ల బడ్జెట్ లెక్కలు మారిపోయాయి.
ఈ దెబ్బ పుష్షకీ బాగా తగిలింది. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. పుష్ష 1, పుష్ష 2.. ఇలా రెండు భాగాలుగా ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ తరవాత అంతటి క్రేజియెస్ట్ ప్రాజెక్టు ఇదే. అయితే.. ఈసినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయిందని, ఆ భారం నిర్మాతల ఊపిరి సలపనివ్వడం లేదని టాక్.
కరోనా వల్ల బడ్జెట్ లో రూ.40 కోట్ల వరకూ తేడా వచ్చిందట. అందుకే ఈ సినిమాకి ఎంత బిజినెస్ జరిగినా, నిర్మాతలు లాభాలతో బయటపడడం చాలా కష్టమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. డిసెంబరు 17న పుష్ష 1ని విడుదల చేద్దామనుకుంటున్నారు. అయితే ఆ డేట్ న పుష్ష రావడం కష్టం అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ డేట్ మారితే.... బడ్జెట్ లెక్క మళ్లీ మారడం ఖాయం.