రాత్రికి రాత్రి పరిస్థితులు మారిపోవచ్చు.. ఇదీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ‘భయంకరమైన’ ట్రెండ్. కరోనా వైరస్ (కోవిడ్-19)కి ముందు, ఆ తర్వాత.. అనే స్థాయికి ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోతున్నాయన్నది నిర్వివాదాంశం. ఇకపై ఎక్కడా పది మంది కంటే ఎక్కువ గుమికూడటం సాధ్యం కాకపోవచ్చేమో.! సినిమా దియేటర్లలోనూ భౌతిక దూరం పాటించాల్సి వస్తుందేమో.! ఇలాంటి అనుమానాలు సినీ పరిశ్రమను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అమెరికాలో ముందు ముందు సినిమా ది¸యేటర్లు కూడా తెరుచుకోనున్నాయి.. అయితే, దియేటర్లలో ‘సోషల్ డిస్టెన్స్’ తప్పనిసరి అట. అంటే, ఓ వరుసలో పదిహేను సీట్లు వున్నాయనుఉంటే.. అందులో కేవలం ముగ్గురికో.. ఐదుగురికో మాత్రమే అవకాశమిస్తారన్నమాట.
ముందు ముందు పరిస్థితులు ఇలాగే వుంటాయా.? వుండకపోవచ్చుగానీ.. వుంటే మాత్రం అది అతి భయానకమే. ఏప్రిల్ నెలపై ఎలాంటి ఆశలూ లేవు. మే నెలపైనా దాదాపుగా సినీ పరిశ్రమ ఆశలు వదిలేసుకుంది. దసరా సీజన్‌పైనే కాస్తో కూస్తో ఆశలున్నాయి. కానీ, డిసెంబర్ వరకు పరిస్థితులు ఏమంత అనుకూలించబోవన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇది ప్రపంచం ఎదుర్కొంటున్న పెను ముప్పు.. అయితే, సినీ పరిశ్రమ ఈ ఉత్పాతంతో.. అత్యంత దారుణంగా నష్టపోతోందన్నది నిర్వివాదాంశం. తెలుగు సినిమానే కాదు, అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఇదే పరిస్థితి వుంది.