చిత్రం: కోర్టు
దర్శకత్వం: రామ్ జగదీశ్
కథ - రచన: రామ్ జగదీశ్
నటీనటులు: ప్రియదర్శి, హర్ష రోషన్, శివాజీ, హర్ష వర్ధన్, శ్రీదేవి, రోహిణి, సాయికుమార్, శుభలేఖ సుధాకర్ తదితరులు
నిర్మాతలు: నాని, ప్రశాంతి తిపిర్ణేని
సంగీతం: విజయ్ బుల్గానీన్
సినిమాటోగ్రఫీ : దినేష్ పురుషోత్తమన్
ఎడిటర్: నవీన్ నూలి
బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా
విడుదల తేదీ: 14 మార్చ్ 2025
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 3.25/5
న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్య ప్రొడ్యూసర్ గా స్పీడ్ పెంచాడు. హీరోగా కెరియర్లో వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా ఉన్న నాని, నిర్మాతగా కూడా అంతే బిజీగా ఉంటున్నాడు. వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యి. చిన్న సినిమాలు , పెద్ద సినిమాలు అన్న తేడా లేకుండా వర్క్ చేస్తున్నాడు. ప్రజంట్ నాని కమెడియన్ ప్రియదర్శి హీరోగా 'కోర్టు' అనే మూవీ నిర్మించాడు. పోక్సో యాక్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో శివాజీ విలన్ రోల్ చేశారు. నాని ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ఈ మూవీ మీకు నచ్చకపోతే హిట్ 3 చూడకండి అని ధీమాగా ఛాలంజ్ చేసాడు. అంటే కోర్టు కథపై నాని కున్న నమ్మకం అలాంటిది. 'కోర్టు - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' ఈ శుక్రవారం థియేటర్స్ లో సందడి చేయనుంది. మరి కోర్టు మూవీ ఎలా ఉంది? నాని నమ్మకాన్ని కోర్టు నిలబెట్టిందా లేదా అన్నది ఈ రివ్యూ లో చూద్దాం.
కథ :
విజయవాడ కోర్టులో సీనియర్ లాయర్ మోహన్ రావు(సాయికుమార్) దగ్గర తేజ (ప్రియదర్శి) జూనియర్ గా పనిచేస్తుంటాడు. మోహన్ రావు ఎప్పటికైనా తనకు ఒక కేసు ఇవ్వకపోతాడా అని తేజ ఎదురుచూస్తున్న టైంలో ఒక పోక్సో కేసు వారి దగ్గరికి వస్తుంది. విశాఖపట్నానికి చెందిన 19 ఏళ్ల మెట్టు చంద్రశేఖర్ (హార్ష్ రోషన్) ఇంటర్ ఫైయిలై ఎదో ఒక పని చేస్తూ ఉంటాడు. తండ్రి వాచ్‌మేన్. తల్లి ఐరన్ చేస్తుంది. చంద్ర శేఖర్ అదే ఏరియాలో ఉంటున్న ఒక రైస్ మిల్ ఓనర్ మంగపతి (శివాజీ) కుటుంబానికి చెందిన జాబిలి(శ్రీదేవి)తో ప్రేమలో పడతాడు. జాబిలి ఇంటర్మీడియట్ చదువుతుంటుంది. అయితే వీరి ప్రేమ నచ్చక మంగపతి శ్రీదేవి వయసు అడ్వాంటేజ్ గా తీసుకొని అమ్మాయిని రేప్ చేశాడని చంద్ర శేఖర్ పై పోక్సో కేసు ఫైల్ చేయిస్తాడు. అన్నిరకాల ప్రయత్నాలు చేసిన తరవాత ఆ కేసు మోహన్ రావు దగ్గరికి వస్తుంది. జాబిలిని చంద్రశేఖర్ నిజంగా రేప్ చేశాడా? చందుకి బెయిల్ కూడా రాకుండా చేసిన లాయర్ దాము(హర్షవర్ధన్) వాదనేంటి? ఈ కేసును టేకప్ చేసిన తేజ ఏం చేశాడు? ఈ కేసులో జాబిలి తల్లి సీతారత్నం (రోహిణి), తేజ బాస్ మోహన్ రావు (సాయి కుమార్)ల పాత్ర ఏంటి? తేజ చందుని బయటకు తీసుకువచ్చాడా? పోక్సో కేసులో ఉన్న నిజా నిజాలు ఏంటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ మధ్య తరచుగా ఫోక్సో కేసులు గూర్చి వింటున్నాం. ఈ నేపథ్యంలోనే కోర్టు మూవీ తెరకెక్కింది. పోక్సో కేసు తీవ్రతని సామాన్యులకి కూడా అర్థం అయ్యేలా ఉంది కోర్టు మూవీ. న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తారు ప్రజలు. కానీ అదే కోర్టులో ఉన్న చట్టాలను బేస్ చేసుకుని ఎలాంటి తప్పుడు కేసులు నమోదు అవుతున్నాయి. సమాజంలో ఉన్న కొందరు తమ పగ, ప్రతీకారాలు నెరవేర్చుకోవటానికి చట్టంలో ఉన్న లొసుగులు ఎలా వాడుకుంటున్నారు అని కోర్టు మూవీ ద్వారా తెలుస్తోంది. జనరల్ గా కులం, మతం వేరు వేరు అని ప్రేమలో పడినవారిని విడదీసేందుకు పరువు హత్యలు చేసేవారు. ఇప్పడు ఫోక్సో చట్టంతో తమ ఇగో కోసం, పరువు ప్రతిష్టల కోసం ఇరవై ఏళ్లు కుర్రాడి జీవితాన్ని ఎలా నాశనం చేసాడన్నది కోర్టులో చూడొచ్చు. అమాయకుడైన చంద్రశేఖర్ ని బయటికి తెచ్చేందుకు తేజ చేసిన ప్రయత్నాలు కోర్టు సినిమా.
టాలీవుడ్ లో పెద్దగా కోర్టు డ్రామాలు వచ్చిన దాఖలాలు లేవు. ఈ మధ్య కాలంలో వకీల్ సాబ్ మూవీ తప్ప తెలుగులో కోర్టు డ్రామా రాలేదు. తమిళం డబ్బింగ్ మూవీ జై భీమ్, మలయాళం మూవీ నెరు, జనగణమన లాంటి సినిమాలు మంచి కోర్టు డ్రామాగా గుర్తింపు పొందాయి. మొదటి సారి తెలుగులో పూర్తి స్థాయి కోర్టు రూమ్ డ్రామా తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసారు దర్శకుడు రామ్ జగదీష్. ఇలాంటి కథని నమ్మకంగా నిర్మించిన నానిని కూడా మెచ్చుకోవాల్సిందే. సినిమా స్టార్టింగ్ లోనే పోక్సో కేసులో చందుకి శిక్ష ఖాయం చేస్తూ ఉంటారు. ఆ సీన్ లోనే కేసు నడిపిస్తున్న తీరు, ఆ కేసు పూర్వపరాలను లాయర్ చదువుతూనే మనకి చూపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. 2013వ సంవత్సరంలో జరిగిన కథగా ఇది ప్రజంట్ చేసారు. ఒక టీనేజ్ ప్రేమ కథను అసభ్యతకు తావు లేకుండా క్యూట్ గా ప్రజెంట్ చేసిన విధానం బాగుంది.
ఈ మూవీలో విలన్ గా కనిపించిన శివాజీ నటన కొత్తగా ఉంది. ఒక సామాన్యుడిపై పవర్ ఫుల్ అస్త్రం లాంటి ఫోక్సో కేసు పెట్టించి పగ, ప్రతీకారం తీర్చుకునే పాత్రలో శివాజీ కనిపించి మెప్పించారు. సమాజంలో ఉన్న కుల, మత ఆర్థిక, సామాజిక అసమానతలను దర్శకుడు ప్రస్తావించిన తీరు అద్భుతం. తేజ పాత్ర ఎంట్రీతో కథలో ఆసక్తి పెరుగుతుంది. తేజ వాదించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకునేలా రాసుకున్నా స్క్రిన్ ప్లే సూపర్ అని చెప్పాలి. అసలు దర్శకుడికి ఇది మొదటి సినిమా అనిపించదు. ఆద్యంతం అంత బాగా హ్యాండిల్ చేసాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్ లో కొన్ని లాజిక్ కి దూరంగా ఉన్నా కథ పరంగా యాక్సెప్ట్ చేసేలా ఉంటాయి. క్యారెక్టర్లతో ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ అయ్యేలా ఉంటుంది సెకండ్ హాఫ్. ఈ సినిమాలో ముఖ్యంగా దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మెచ్చుకోవలసిందే. విద్యార్థి దశ నుంచే చట్టాల గురించి కొంచెం అవగాహన కల్పించటం మంచిది అని ఒప్పించేలా చేసాడు దర్శకుడు.
నటీ నటులు:
కోర్ట్ సినిమాలో ప్రియదర్శి, శివాజీ మెయిన్ లీడ్ అని చెప్పాలి. సినిమా మొత్తం వీరిద్దరే నడిపించారు. శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ లో #90 స్ మిడిల్ క్లాస్ లాంటి సిరీస్ తో కామ్ & కూల్ గా కనిపిస్తే. కోర్టులో విలన్ గా అద్భుతంగా నటించారు. శివాజీ నటన ప్రేక్షకుడికి కొత్తగా,ఫ్రెష్‌గా అనిపిస్తుంది. మంగపతి పాత్రలో శివాజీ పరకాయ ప్రవేశం చేసాడు. నటన, ఆహార్యం అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. మంగపతి పాత్ర మిగతా పాత్రలని డామినేట్ చేసింది. కథలో ఇంకో కీలక పాత్రలో కనిపించిన ప్రియదర్శి సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. ప్రియదర్శి పోషించిన పాత్రలో కేవలం లాయర్ తేజ మాత్రమే కనిపిస్తాడు. అంతలా ఆ పాత్రకి ప్రియదర్శి కనెక్ట్ అయిపోయాడు. చందు పాత్రలో నటించిన హర్ష రోషన్ బాగానే నటించాడు. జాబిల్లి కారెక్టర్‌లో శ్రీదేవీ పర్వాలేదనిపించింది. హర్ష వర్దన్, సాయి కుమార్ సీనియర్ లాయర్లుగా అద్భుతంగా కనిపిస్తారు. కుర్రాడి తల్లిగా ప్రభావతి, అమ్మాయి తల్లిగా రోహిణి పాత్రలు బాగున్నాయి. వారి నటన సైతం ఆకట్టుకుంటుంది.
టెక్నికల్ :
టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు రామ్ జగదీశ్ చాలా సెన్సిబుల్ సబ్జెక్టు అయిన “పోక్సో” యాక్ట్ కథని తీసుకుని అసభ్యతకు ఆస్కారం లేకుండా సినిమా మొత్తం నడిపించాడు. పోక్సో చట్టం పై సామాన్యులకి కొంచెం అవగాహన కలిగేలా చేసాడు. తనకి కన్వీనియెంట్ గా ఉండేలా స్క్రీన్ ప్లే, కోర్ట్ ప్రొసీడింగ్స్ రాసుకున్నాడు. ఇదంతా సినిమాటిక్ లిబర్టీ. కథకుడిగా కంటే దర్శకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు రామ్ జగదీష్. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన పాటలు, ఆర్ఆర్ సినిమాకి ప్రధాన బలం. 2013లో జరిగే కథగా కెమెరామెన్ అందించిన విజువల్స్ బాగున్నాయి. కోర్ట్ సెట్ కూడా హంగులతో కాకుండా న్యాచురల్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా సినిమాలో లీనం అయ్యేలా చేసింది. కోర్టు మూవీలో చాలా డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. నిర్మాతగా నాని టేస్ట్ ఏంటో అందరికీ అర్థం అయ్యింది. ఓ మంచి సబ్జెక్ట్ ని ఆడియెన్స్ కి పరిచయం చేసిన ఘనత నానికి దక్కుతుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. తన జడ్జ్ మెంట్ పై నమ్మకంతో నాని స్వేచ్ఛగా ఖర్చు పెట్టాడు అని తెలుస్తోంది.
ప్లస్ పాయింట్స్
శివాజీ
ప్రియదర్శి
సంగీతం
మైనస్ పాయింట్స్
లాజిక్స్ మిస్సింగ్
ఫైనల్ వర్దిక్ట్ : భావోద్వేగాల కథ 'కోర్టు'..