నటీనటులు: ఆది సాయి కుమార్, దిగంగన సూర్యవంశీ, మిర్నా మీనన్, సప్తగిరి
దర్శకత్వం : ఫణి కృష్ణ సిరికి
నిర్మాతలు: కె కె రాధామోహన్
సంగీతం: ఆర్ ఆర్ ధృవన్
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
ఎడిటర్: సత్య గిడుతూరి
రేటింగ్: 2.5/5
ప్రేమ కావాలి, లవ్లీ.. ఇలా వరుసగా రెండు విజయాలతో యూత్ ఫుల్ స్టార్ అనిపించుకున్నాడు ఆది సాయికుమార్. అయితే తర్వాతే కెరీర్ తేడా కొట్టింది. ఆది కి సరిపడా కథలు రావడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నా సరైన విజయం మాత్రం రావడం లేదు. ఇప్పుడు ‘క్రేజీ ఫెలో’గా మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కొత్త దర్శకుడు ఫణి కృష్ణ సిరికి తెరకెక్కించిన చిత్రమిది. ఈ ‘క్రేజీ ఫెలో’ సక్సెస్ అయ్యాడా? లేదా? ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించిందా, లేదా?
* కథ:
అభి (ఆది సాయికుమార్) టైటిల్ కి తగ్గట్టే క్రేజీ కుర్రాడు. ఫ్రెండ్స్ తో జాలీగా జీవితం గడిపేస్తుంటాడు. అన్నట్టు.. అభికి 'తొందరపాటు' ఎక్కువ. దానివల్ల అనవసరమైన సమస్యలు వస్తుంటాయి. అభి అల్లరితో విసిగిపోయిన అతడి అన్న.. తనని దారిలో పెట్టేందుకు తెలిసిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగానికి వెళ్లమంటాడు. ఆఫీస్ లో మధుమిత (దిగంగన)ను చూస్తాడు అభి. గతంలో అభి చేసిన అల్లరి పనుల్ని చూసిన మధు..అభిని ద్వేషించడం మొదలుపెడుతుంది.
అయితే అనుకోకుండా నాని - చిన్ని అనే మారు పేర్లతో ఓ డేటింగ్ యాప్ ద్వారా వీరిద్దరూ దగ్గరవుతారు. అసలైన ఫొటోలు, పేర్లు లేకపోవడంతో తామెవరితో ఛాటింగ్ చేస్తున్నదీ ఇద్దరికీ తెలియదు. ఇద్దరూ ఓరోజు ప్రత్యక్షంగా కలవాలనుకుంటారు. ఆ సమయంలోనే అభి 'తొందరపడి' ఓ తప్పు చేస్తాడు. తను ఛాటింగ్ చేసే చిన్ని అనుకొని మరొక చిన్ని (మిర్నా మేనన్)కు ప్రపోజ్ చేస్తాడు. ఒక గొడవ కారణంగా మిర్నాతో అభికి పెళ్లి కూడా కుదురుతుంది. మరి తను ఛాట్ చేసిన చిన్ని.. తనతో పెళ్లికి సిద్ధమైన చిన్ని ఒకరు కాదని అతడికి ఎలా తెలిసింది ? అభి జీవితం ఎలాంటి మలపులు తిరిగింది అనేది మిగతా కథ.
* విశ్లేషణ :
ఒకరికొకరు చూసుకోకుండా లెటర్స్ ద్వారా ఫోన్స్ ద్వారా ప్రేమించుకోనే ఫార్ములా కొత్త కాదు. ఇప్పటికే ఇలాంటి తరహలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే క్రేజీ ఫెలోలో 'తొందరపాటు' క్యారెక్టర్ దీనికి యాడ్ అయ్యింది. అలాగే ఒక డేటింగ్ యాప్ ని కూడా కథలో భాగం చేశారు. ఇలాంటి కథల్లో మంచి వినోదం పండించే స్కోప్ వుంది. క్రేజీ ఫెలో దర్శకుడు కామెడీ విషయంలో ఓకే అనిపించినా ప్రేమకథలో ఘాడతని మాత్రం తీసుకురాలేకపోయాడు. అభిగా ఆది పాత్ర పరిచయం చేసిన సీన్లు నవ్విస్తాయి. తర్వాత సఫ్ట్‌వేర్ కంపెనీలో చేసిన అల్లరి కూడా బావుంటుంది. తన కంపెనీని అమ్ముకొని అదే కంపనీలో బాయ్ గా పని చేసే నర్రా శ్రీనివాస్ పాత్రలో కొంత హాస్యం పండింది. రొటీన్ గా వున్నా సరే టైం పాస్ అయిపోతుంది.
అభి - మధు .. డేటింగ్ యాప్ ద్వారా మారుపేర్లతో మాట్లాడుకొని, ఆఫీస్ లో గొడవ పడే సీన్లు నితిన్ గుండెజారి సినిమాని గుర్తుకు తెస్తాయి. ఐతే ద్వితీయార్ధం మాత్రం తేలిపోయింది. వెరొక చిన్న అభి జీవితంలోకి వచ్చిన తర్వాత కథ తిరిగిన చోటే తిరుగుతుంది. మిర్నా పాత్రని సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు. ఆ పాత్ర సినిమాలో ఎలాంటి డ్రామా క్రియేట్ అవ్వదు. చివరికి ఆ పాత్రని త్యాగ మూర్తిలా ముగించినప్పటికీ అందులో ఎలాంటి ఇంపాక్ట్ వుండదు. సెకండ్ హాఫ్ లో వినోదం పాళ్ళు కూడా తక్కువే.క్లైమాక్స్ కూడా చాలా రొటీన్ గా ముగుస్తుంది. ప్రేమకథలో సంఘర్షణ చాలా ముఖ్యం. ఈ కథలో అదే లోపించింది.
* నటీనటులు :
ఆది సాయికుమార్ లుక్ ఫ్రెష్ గా వుంది. తన పాత్రలో చలాకీగ నటించాడు. యాక్షన్ , డ్యాన్స్ లో ఈజ్ చూపించాడు. దిగంగన సూర్యవంశీ, మిర్నా మేనన్ అందంగా వున్నారు, నటన కూడా ఓకే.
దిగంగన పాత్రకు ఎక్కువ స్కోప్ దొరికింది. నర్రా శ్రీనివాస్, సప్తగిరి పాత్రలని మరింత వాడుకోవల్సింది. అనీష్ కురువిల్లా, వినోదిని వైద్యనాథ్ పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.
* సాంకేతిక వర్గం :
నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. కెమరా పని తనం నీట్ గా వుంది. ద్రువన్ మ్యూజిక్ ఓకే. సెకండ్ హాఫ్ ని మరింత షార్ఫ్ చేయాల్సింది.
ఫణికృష్ణ రచనలో వినోదం వుంది. అయితే భావోద్వేగాల విషయంలో తడబాటు కనిపించింది. ప్రేమకథలో మంచి ఎమోషన్ తీసుకొచ్చివుంటే క్రేజీ ఫెలో మరింత బెటర్ గా వుండేవాడు.
* ప్లస్ పాయింట్స్
- ఆది పాత్ర
- వినోదం, పాటలు
* మైనస్ పాయిన్స్
- ఎమోషన్స్ మిస్ కావడం
- రొటీన్ ముగింపు
* ఫైనల్ వర్దిక్ట్ : సిల్లీ ఫెలో